ఎండు మిర్చికి ధరాఘాతం | - | Sakshi
Sakshi News home page

ఎండు మిర్చికి ధరాఘాతం

Published Mon, Nov 18 2024 3:10 AM | Last Updated on Mon, Nov 18 2024 11:46 AM

ఎండు

ఎండు మిర్చికి ధరాఘాతం

గిట్టుబాటు కాక రైతుల గగ్గోలు

దిగుబడులు బాగున్నాయి

గడిచిన రెండేళ్ల నుంచి తెగుళ్లు, వర్షాభావ పరిస్థితులతో ఎండుమిర్చి దిగుబడులు తగ్గాయి. అయితే, ఈ ఏడాది అంచనా కన్నా సాగు తగ్గినా.. పంట బాగా ఉంది. దిగుబడులు ఆశించిన మేర వచ్చే అవకాశం ఉంది. ఎండుమిర్చికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే విషయాన్ని మార్కెటింగ్‌ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. – ఎంఏ అక్బర్‌,

జిల్లా ఉద్యానశాఖ అధికారి

గత రెండేళ్లుగా

తెగుళ్లు సోకి సగానికి తగ్గిన దిగుబడి

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా

పడిపోయిన సాగు విస్తీర్ణం

ఈ ఏడాది ఆశాజనకంగా దిగుబడి.. ధరలపైనే రైతుల దిగాలు

మార్కెట్‌ సౌకర్యం లేకపోవడంతో మరిన్ని తిప్పలు

గద్వాల/గద్వాల వ్యవసాయం: ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా దాదాపు 44 వేల ఎకరాల్లో ఎండుమిర్చి పంట సాగు చేశారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పంట చేతికి రాగా, మరికొన్ని ప్రాంతాల్లో నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో చేతికి రానుంది. ఇదిలా ఉంటే.. గడిచిన రెండేళ్లుగా త్రిప్స్‌ వంటి వివిధ రకాల తెగుళ్లకు తోడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడులపై గణనీయంగా ప్రభావం చూపి దెబ్బతీయగా, మరోవైపు ఽగిట్టుబాటు ధర సైతం లభించలేదు. దీంతో కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికీ గోదాంలలో నిల్వ ఉంచుకుని ఎదురు చూస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇదే క్రమంలో సాగువిస్తీర్ణం గతేడాది కంటే సగానికి పడిపోయింది.

సంప్రదాయ పంటలకు భిన్నంగా..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన 14 ఏళ్లుగా రైతులు సంప్రదాయ పంటలకు భిన్నంగా కమర్షియల్‌ పంటల సాగుపై దృష్టిసారించారు. ఈ క్రమంలో ఎండుమిర్చి సాగుపై దృష్టిసారిస్తున్నారు. కొంత వ్యయప్రయాసంతో కూడుకున్నది అయినప్పటికీ వాతావరణం అనుకూలించి పంట దిగుబడులు ఆశాజనకంగా చేతికి వస్తే పత్తి కంటే కూడా మిర్చికే మంచి ధరలు లభిస్తాయన్న ఉద్దేశంతో ఈ పంటను సాగు చేస్తున్నారు. ఎకరాకు రూ.60 – 70 వేల వరకు సాగు ఖర్చులు అవుతుండగా దిగుబడి రూపంలో ఎకరాకు 20– 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కరుణ, సూపర్‌టెన్‌, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలకు మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉండటంతో వీటినే ఎక్కువగా సాగు చేస్తున్నారు.

గిట్టుబాటు ధరేది..?

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండు మిర్చి కోతకు వచ్చింది. పంట కోత పూర్తయిన తర్వాత కల్లాలో ఎండబెట్టి, విక్రయిస్తారు. అయితే ఈసారి చాలా ప్రాంతాల్లో పంట బాగుందనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఆశించిన మేర దిగుబడులు వస్తాయని భావిస్తున్నారు. కాగా ధరలు ఎలా ఉంటాయో అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ వైరెటీలు క్వింటాల్‌కు కనీసం రూ.25 వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఇక మరికొన్ని వైరెటీలకు రూ.45 వేల నుంచి రూ.50 వేలు వస్తేనే ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది.

● మార్కెటింగ్‌ సౌకర్యం లేక ఏపీ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల మార్కెట్లకు తీసుకెళ్లి ఎండుమిర్చిని రైతులు విక్రయించాల్సి వస్తోంది. రెండేళ్ల క్రితం గద్వాల మార్కెట్‌ యార్డులో కొనుగోళ్లు ప్రారంభించినా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఇప్పటికై నా ఎండుమిర్చికి మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

గిట్టుబాటు కల్పిస్తేనే..

ఏటా ఎండుమిర్చి సాగు చేస్తాను. రెండేళ్ల నుంచి దిగుబడులు, ధరలు తగ్గినా.. పెట్టుబడులు మాత్రం పెరిగాయి. ఈ ఏడాది పంట బాగా ఉంది. గిట్టుబాటు ధరలు వస్తేనే ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది.

– బోయ వెంకటేశ్వర్లు, రైతు, చిన్నిపాడు, మానవపాడు మండలం

మానవపాడు మండలం గోకులపాడు శివారులో ఎండుమిర్చి సాగు

రెండేళ్లు వెంటాడిన కష్టాలు..

2022– 23, 2023– 24లో ఉమ్మడి జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేయగా.. త్రిప్స్‌, ఎండు, మడత తెగుళ్లు, జెమిని వైరస్‌ ఆశించడంతో ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 8 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. 2023–24లో జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యధికంగా 65,113 ఎకరాల్లో సాగు చేయగా.. తీవ్రవర్షాభావ పరిస్థితుల వల్ల దిగుబడులు సగానికి తగ్గడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదే సమయంలో బహిరంగా మార్కెట్‌లో ధరలు కూడా పడిపోయాయి. ఎండుమిర్చిలో వైరెటీని బట్టి మార్కెట్‌లో ధరలు లభిస్తాయి. క్వింటాలు రూ.20 వేలు పలకాల్సిన కొన్ని వైరెటీలకు రూ.13 వేల నుంచి రూ.15 వేలు, రూ.25 వేలు పలకాల్సిన వైరెటీలు రూ.16 వేల నుంచి రూ.18 వేలు, రూ.45 నుంచి రూ.50 వేలు రావాల్సిన వైరెటీలకు రూ.35 వేల నుంచి రూ.40 వేలు వచ్చాయి. గతంలో 75 వేల ఎకరాలు సాగు చేయగా.. ఈసారి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 44 వేల ఎకరాల్లో మాత్రమే పంటను సాగుచేశారంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
ఎండు మిర్చికి ధరాఘాతం 1
1/2

ఎండు మిర్చికి ధరాఘాతం

ఎండు మిర్చికి ధరాఘాతం 2
2/2

ఎండు మిర్చికి ధరాఘాతం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement