గ్రూప్–3 పరీక్షకు 2,353 మంది హాజరు
నారాయణపేట రూరల్: జిల్లాలో టీజీపీఎస్‌సీ గ్రూప్–3 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం జరిగిన మొదటి సెషన్ పరీక్షకు జిల్లా కేంద్రంలో 13 సెంటర్లలో మొత్తం 4024 మంది అభ్యర్థులకుగాను 2353 మంది హాజరు కాగా 1671 మంది గైర్హాజరు అయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం సెషన్ పరీక్షకు 2354 మంది అభ్యర్థులు హాజరవ్వగా 1670 మంది గైర్హాజరు అయ్యారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం 8.30 గంటలకే కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించగా చివరి క్షణం వరకు మురుకులు పరుగులు పెడుతూనే అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. చాలా పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు గడువు సమయం ముగిసిన తర్వాత కేంద్రానికి రావడంతో లోపలికి అనుమతించలేదు. బతిమిలాడిన ప్రయోజనం లేకపోవడంతో వెనుతిరగాల్సిన అవసరం ఏర్పడింది. మహిళా అభ్యర్థులతో వచ్చిన బంధువులు వారి చిన్నారులను ఆడిస్తూ కేంద్రం బయట కనిపించారు.
పకడ్బందీగా..
పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు. ముందుగా చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హాజరు, గైర్హాజరు వివరాలపై కళాశాల ప్రిన్సిపాల్ మెర్సి వసంతను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని సీసీ కెమెరాలను అమర్చారని అడిగి తెలుసుకున్నారు. తర్వాత రవితేజ టాలెంట్ స్కూల్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల హాజరు శాతం నమోదు గురించి ఆ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌తోతో మాట్లాడారు. పరీక్షలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చివరగా జిల్లా కేంద్రానికి సమీపంలోని ద్వారక పాఠశాలలోని పరీక్షా కేంద్రాన్ని సైతం ఆమె పరిశీలించి అక్కడి వసతి సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష సమయంలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతించకూడదని అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే పరీక్ష కేంద్రంలోకి వెళ్లేలా చూడాలన్నారు. అభ్యర్థుల ఫోన్లు, వాచ్‌లు ఎక్కడ పెడుతున్నారని ప్రశ్నించగా కేంద్రం బయట ప్రత్యేకంగా ఒక కౌంటర్ ఏర్పాటు చేశామని, అక్కడే అభ్యర్థుల వస్తు సామగ్రిని భద్రపరచినట్లు సిఎస్ తెలిపారు.
బందోబస్తు పరిశీలన
జిల్లా కేంద్రంలోని సీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల, బ్రిలియంట్, సోషల్ వెల్ఫేర్ కాలేజ్ పరీక్షా కేంద్రాలను, పోలీసు బందోబస్తును ఎస్పీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు. అధికారులు, సిబ్బంది అందరు బాధ్యతగా పని చేయాలని పరీక్ష పత్రాలు స్ట్రాంగ్ రూంకు చేరే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారురు. ఆయన వెంట డీఎస్పి ఎన్ లింగయ్య, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.
4024 మంది అభ్యర్థులకు
1,671 మంది గైర్హాజరు
సమయం ముగిసిన తర్వాత వచ్చిన వారికి అనుమతి నిరాకరణ
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్,
ఎస్పీ యోగేష్ గౌతమ్
Comments
Please login to add a commentAdd a comment