ఇక నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్
నర్వ: ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీబీవీ) ఇక నుంచి తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్‌గా మారనుందని రీజినల్ మేనేజర్ రవికిశోర్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక ఏపీజీవీబీ వద్ద నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సుకు హాజరైన ఆయన ఖాతాదారులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 920 శాఖలతో అతి పెద్ద బ్యాంకుగా సేవలందిస్తున్న ఈ బ్యాంకు 2025, జనవరి 1 నుంచి 33 జిల్లాల్లో తెలంగాణ గ్రామీణ వికాస్ బ్యాంక్‌గా సేవలందిస్తుందన్నారు. పట్టణంలో 11 ఏళ్లుగా ఖాతాదారులకు సేవలందిస్తున్న ఈ బ్యాంకు అందరి సహకారంతో రూ.52 కోట్ల టర్నోవర్‌తో ముందుకు సాగుతుందని వివరించారు. ఖాతాదారులు తప్పనిసరిగా సురక్షబీమా యోజన, జీవనజ్యోతి పాలసీలను కేవలం రూ.536 చెల్లించి రూ.2 లక్షల బీమా పొందవచ్చన్నారు. జీవనజ్యోతి, సురక్షబీమా యోజన కలిగి మృతిచెందిన ఖాతాదారుల కుటుంబీలకు రూ.2 లక్షల చొప్పున చెక్కు అందజేశారు. అనంతరం ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ బారిన పడిన గంటలోపు టోల్‌ఫ్రీ నంబర్ 1930కి ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎం రవికిశోర్‌రెడ్డి, మేనేజర్ శ్రీకాంత్, క్షేత్ర అధికారి ఖరీం, క్యాషియర్ రమేశ్, ఖాతాదారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment