మిరప రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

మిరప రైతు కుదేలు

Published Tue, Jan 21 2025 12:44 AM | Last Updated on Tue, Jan 21 2025 12:43 AM

మిరప

మిరప రైతు కుదేలు

మరికల్‌: అటు వెంటాడిన తెగుళ్లు.. ఇటు మార్కెట్‌లో పడిపోయిన ధరలతో మిరప రైతులు కుదేలయ్యాడు. గతేడాది కాస్తో కూస్తో మిర్చికి ధర ఉండేది. ఈ ఏడాది ఆఽ దరలు కూడా లేకపోవడంతో రైతులను నిరాశలోకి నెట్టింది. మిరపకు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తీరని నష్టం వాటిళ్లింది. పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుస్థితి నెలకొంది. దిగుబడి సగానికి తగ్గింది. కనీసం పండిన పంటకు మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గతేడాది క్వింటాల్‌ మిర్చి రూ.18 వేల పైగా ఉంటే ఈ ఏడాది ఊహించని విధంగా రూ.12 వేలకు పడిపోయింది.

పూత, కాత దశలోనే..

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 510 ఎకరాల్లో మిరప పంట సాగు చేశారు. పంట పూత, కాత దశలో అధిక వర్షాలు, మేఘావృత్తంగా ఉండటంతో తామర, వేరుకుళ్లు తెగులు సోకడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. తెగుళ్లు సోకి పంట ఎండిపోవడంతో పాటు కాయలపై మచ్చలు ఏర్పడి నేలరాలుతున్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్ని రకాల పురుగు మందులు పిచికారీ చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. తెగుళ్లను అదుపు చేయలేక మరికల్‌, నర్వ, మద్దురు, కోస్గి, ధన్వాడ మండల్లాలో కొందరు రైతులు మిరప పంటను వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. మిర్చి పంటకు ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. వారానికి రెండు సార్లు పురుగు మందులు పిచికారీ చేసినా ఎకరాకు 3 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తుంది.

దళారుల దోపిడీ

జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం లేక పంట విక్రయించడానికి హైదరాబాద్‌, రాయచూర్‌, గుంటూర్‌లోని మార్కెట్లకు తీసుకెళ్లడం వల్ల రవాణా ఖర్చులు అధికమవడమే కాకుండా అక్కడ తేమ, తుక్కు, కమిషన్‌ పేరిట అక్కడి దళారుల దోపిడీతో రైతులు నిండా మునుగుతున్నారు. ఈ సారి మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఽమాత్రమే ధర ఉండటంతో పెట్టుబడులు రాని పరిస్థితి నేలకొంది. వాతావారణ పరిస్థితుల కారణంగా దిగుబడులు లేక రైతులు ఉసూరుమంటున్నారు. మూడేళ్లుగా మిర్చి విత్తనానికి ప్రభుత్వం నుంచి రాయితీ లభించకపోవడం మార్కెట్‌లో మిర్చి ధరలు స్థిరంగా లేకపోవడం వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వాతావరణం పరిస్థితులు ఇలాగే కొనసాగితే మిర్చి పంటకు అనేక తెగుళ్లు వచ్చి మరింత దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

రంగు మారిన పంట

తెగుళ్ల కారణంగా రంగు మారిన మిర్చీ పంటను మార్కెట్‌లో కొనుగోలు చేయడం లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా తక్కువగా క్వింటాల్‌కు రూ.5 వేలకు అడుగుతున్నారు. నాణ్యమైన పంట ఎంత వచ్చిదో రంగు మారిన మిర్చి కూడా అంతే దిగుబడి రావడంతో రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో చేసేంది లేక మార్కెట్‌లో వచ్చిన ధరకే పంటలను విక్రయించి నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

తెగుళ్లతో తగ్గిన దిగుబడి

పడిపోయిన ధరలతో మరిన్ని కష్టాలు

గతేడాది క్వింటాల్‌కు రూ.18 వేలపైన పలికిన ధర

ఈ ఏడాది రూ.8వేల నుంచి రూ.12 వేల లోపే..

No comments yet. Be the first to comment!
Add a comment
మిరప రైతు కుదేలు 1
1/1

మిరప రైతు కుదేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement