గ్రామ, వార్డుసభలకు విస్తృత ఏర్పాట్లు
నారాయణపేట: ఈ నెల 21నుండి 24 వరకు గ్రామ, వార్డుసభల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగినదని, లబ్ధిదారుల ఎంపిక అనేది నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తులు తీసుకుంటామని, జిల్లా ప్రజలు సహకరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు చేరేలా పటిష్ట కార్యాచరణ అమలు చేస్తున్నట్లు, అందుకు గాను ఈ నెల 16 నుండి 20 వరకు క్షేత్ర స్థాయి దరఖాస్తులు పరిశీలన చేయడం జరిగిందన్నారు. ఈ 21 నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా ప్రజలు సహకరించాలని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభించనుందని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పంట వేసినా, వేయకపోయినా అందుతుందని, రైతులు అనవసర అపోహలు పెట్టుకోవద్దని, రైతు భరోసా పథకానికి ఎటువంటి పరిమితులు లేవని, వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రూ.12 వేలు పెట్టుబడి సహాయం ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా సొంత భూమి ఉండి ఇళ్లు లేని కుటుంబాల జాబితాను సిద్ధం చేశామని, గ్రామ సభలో అభ్యంతరాలను స్వీకరించడం జరుగుతుందని, గ్రామసభలో అర్హుల జాబితా గ్రామాల వారీగా సిద్ధం చేసిన తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సభల్లో ఇచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. కుటుంబంలో విభజన అయినవారు కొత్త కార్డు కావాలని తీసుకున్న దరఖాస్తును, గతంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలిస్తామన్నారు. ఇదివరకు ఎప్పుడూ దరఖాస్తు సమర్పించకపోయినా గ్రామాల్లోకి వచ్చే అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల ప్రభుత్వ సంక్షేమ పథకాల పై సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శులను, ఎంపీడీఓలను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై
అవగాహన కల్పించాలి
నారాయణపేట: జిల్లాలో మాదకద్రవ్యాల నిషేధాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్ధాలపై జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రతి వారం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో మాదకద్రవ్యాల నిషేధం( నార్కోటిక్ డ్రగ్స్ )పై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో గంజాయి సాగు జరగకుండా వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. అన్ని జూనియర్, డిగ్రీ కళాశాలలో యాంటీ డ్రగ్ కమిటీల ద్వారా మాదకద్రవ్యాల నిషేధంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆర్డిఓ రామచంద్రనాయక్, డీఏఓ జాన్ సుధాకర్, డిఇఓ గోవిందరాజులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 25 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బెన్‌షాలం, ఆర్డీవో రామచందర్‌నాయక్, ఏవో జయసుధ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment