కోల్‌కతా: కోల్‌కతా ఆర్‌జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. దీనిపై విపక్షాలు, విద్యార్ధి సంఘాలు, వైద్యుల నిరసనలతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ సమయంలో బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం.. సోమవారం నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా అత్యాచారానికి పాల్పడిన దోషులకు మరణశిక్ష విధించేలా బిల్లును బెంగాల్ న్యాయ మంత్రి మోలోయ్ ఘటక్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీనికి 'అపరాజిత స్త్రీ, చైల్డ్ బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టాలు, సవరణ) బిల్లు 2024'గా పేరు పెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి మహిళలు పిల్లలకు రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లు తీసుకొచ్చింది.
ఈ బిల్లులో ఏమి ఉంటుంది
- అత్యాచారం, హత్య కేసుల్లో మరణశిక్ష విధించే నిబంధన.
- ఈ బిల్లు ప్రకారం ఛార్జ్ షీట్ దాఖలు చేసిన 36 రోజుల్లోగా మరణశిక్ష విధించే నిబంధన ఉంటుంది.
- అత్యాచారం మాత్రమే కాదు యాసిడ్ దాడి కూడా అంతే తీవ్రమైన నేరం, దీనికి జీవిత ఖైదు విధించే నిబంధన ఈ బిల్లులో ఉంది.
- ప్రతి జిల్లాలో స్పెషల్ ఫోర్స్-అపరాజిత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు.
- ఈ అపరాజిత టాస్క్ ఫోర్స్ అత్యాచారం, యాసిడ్ దాడి లేదా వేధింపుల కేసుల్లో చర్య తీసుకుంటుంది.
- ఎవరైనా బాధితురాలి గుర్తింపును వెల్లడిస్తే, అతనిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.
కాగా ఈ బిల్లు గురించి గతంలో మమతా బెనర్జీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. అత్యాచార ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని దీదీ స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న చట్టాలను సవరించి, అత్యాచార నిందితులకు మరణ శిక్ష పడేలా అసెంబ్లీలో వచ్చేవారం బిల్లును ప్రవేశపెడతామని ప్రకటించారు. ఆ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపుతామని, దానికి ఆమోదం లభించకపోతే.. రాజ్‌భవన్ బయట నిరసన తెలుపుతామని హెచ్చరించారు.
#WATCH | Kolkata, West Bengal: Junior Doctors continue to sit at the protest site in the Lalbazar area. They have been demanding justice for a woman doctor who was raped and murdered at RG Kar Medical College and Hospital on August 9. pic.twitter.com/HZ7mfOxAE2
— ANI (@ANI) September 3, 2024
కోల్‌కతా వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసుపై సీబీఐ రెండు సమాంతర దర్యాప్తులు జరుపుతోంది. మొదటిది అత్యాచారం, హత్య కేసుకు సంబంధించినది కాగా, రెండవది ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో ఆర్థిక అవకతవలకు సంబంధించినది. ఈ నేరానికి సంబంధించి ఆర్‌జీ కర్ వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.
మరోవైపు కోల్‌కతాలోని వివిధ వైద్య కళాశాలలకు చెందిన జూనియర్ వైద్యులు మంగళవారం ఉదయం బిబి గంగూలీ వీధిలో తమ నిరసనను కొనసాగించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీబీ గంగూలీ స్ట్రీట్‌లో పోలీసులు భారీ సంఖ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు ర్యాలీగా తరలివెళ్లే ప్రయత్నం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment