ఎన్నాళ్లుగానో ఉద్దం సింగ్ ఎదురు చూసిన అవకాశం చివరికి 1940 మార్చి 13న లభించింది. లండన్‌లోని కాక్సటన్ హాల్‌లో జరిగిన సమావేశానికి డయ్యర్ హాజరయ్యాడు. ఇదే సభకు ఉద్దం సైతం ఒక తుపాకీతో హాజరయ్యారు. మీటింగ్ ముగియగానే డయ్యర్ డయాస్ మీదకు వెళుతుండగా సూటిగా రెండుసార్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడిక్కడే ఆ కిరాతక సైనికాధికారి మరణించాడు.
‘‘బ్రిటిష్ సామ్రాజ్యవాదం నశించాలి. నాగరికత పేరుతో మీరు భారతీయులను తరతరాలుగా బానిసలను చేస్తున్నారు. మీకు సిగ్గనేది ఉంటే మీ చరిత్ర చూసుకొని మీరు అవమానంతో చస్తారు. అలాంటి మీరా.. మాకు నాగరికత నేర్పేది? మీరు నాకు మరణ శిక్ష విధిస్తారన్నా నేను లెక్కచేయను. నా మరణానికి నేను గర్విస్తాను. నేను మరణిస్తే నాలాంటివాళ్లు లక్షలమంది పుట్టుకొచ్చి మీ పునాదులు పెకలిస్తారు. నన్ను ఇంగ్లిషు కోర్టులో ఇంగ్లిషు జడ్జిలు విచారిస్తున్నారు, ఇందులో సమానత్వం ఎక్కడ? ఇంగ్లిషు కుక్కలు ఇండియాలో చేరాయి, వాటిని తరిమికొట్టే రోజు దగ్గరలోనే ఉంది’’ అని ఒక భారతీయ యువకుడు లండన్ నగరంలోని ఓల్డ్ బెయిలీ కేంద్ర క్రిమినల్ కోర్టులో గర్జిస్తున్నాడు.
‘బ్రిటిష్ కుక్కలు నశించాలి’
1940 జూన్ నెలలో ఆ కోర్టులో ఒక అసాధారణ కేసు విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా సదరు ముద్దాయి మాటలను ఇంకా వినేందుకు బ్రిటిష్ న్యాయమూర్తి అంగీకరించ లేదు. ‘‘ నేను చెప్పే నిజాలు వినడానికి మీకు ఇబ్బందిగా ఉంది కదా?’’ అని ఆ ముద్దాయి ప్రశ్నించాడు. చివరగా బ్రిటిష్ కుక్కలు నశించాలి అని నినాదమిస్తూ న్యాయమూర్తి బల్లపై ఉమ్మేశాడు! దీంతో ఇక వాదనలు వినకుండానే జడ్జి సదరు ముద్దాయికి శిక్ష ఖరారు చేశాడు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య రాజధానిలో వాళ్ల కేంద్ర న్యాయస్థానంలో బహిరంగంగా వారి దుర్నీతిని దునుమాడి, వారిపై యుద్ధం ప్రకటించిన ఆ వీరుడు.. ఉద్దం సింగ్! బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉద్దం ఎంతలా చికాకుపరిచాడంటే, చివరకు ఆయన కోర్టులో చేసిన ప్రసంగాన్ని కూడా బయటకు విడుదల చేయడానికి వలస ప్రభుత్వం అంగీకరించ లేదు. చాలా సంవత్సరాల పోరాటం అనంతరం 1996 లో ఉద్దం చివరి ప్రసంగం బయటకువచ్చింది.
పగ కూడా బతికిస్తుంది
1899 డిసెంబర్ 26న పంజాబ్‌లోని ఒక పేద కుటుంబంలో షేర్ సింగ్ (ఉద్దం అసలు పేరు) జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఉద్దంను తండ్రి గారాబంగా పెంచాడు. అయితే ఆ ముచ్చట కూడా త్వరగానే ముగిసింది. ఉద్దంకు 8 ఏళ్లప్పుడు ఆయన తండ్రి కూడా మరణించారు. బంధువుల అండ దొరకని ఉద్దం తన చిన్నతనాన్ని సెంట్రల్ ఖల్సా అనాథాశ్రయంలో గడిపారు. అక్కడే ఆయనకు ఉద్దం సింగ్ అనే పేరువచ్చింది. ‘ఉద్దం’ అంటే తిరుగుబాటు అని అర్థం. చిన్నవయసులోనే ఆయన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఆర్మీకి చెందిన సిఖ్ పయోనీర్స్‌లో పనిచేశారు.
1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ దురంతం ఆయన జీవిత దృక్పథాన్నే మార్చివేసింది. కాంగ్రెస్ నాయకుల అరెస్టుకు నిరసనగా వేలాది ప్రజలు జలియన్ వాలాబాగ్‌లో ప్రదర్శన నిర్వహిస్తున్న ప్పుడు. వారికి ఉద్దం మంచినీరు అందించే వాలంటీర్‌గా ఉన్నారు. అదే సమయంలో కల్నల్ డయ్యర్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో వందలమంది మరణించారు. దీన్ని ప్రత్యక్షంగా చూసిన ఉద్దం రక్తం మరిగింది. కంటినిండా నీరు ఉబికివస్తుండగా ఆ తోటలోని రక్తం అంటినమట్టిని తీసుకొని ‘‘ఈ దురంతానికి కారకులైన వ్యక్తులను చంపేదాకా నేను చావను‘’ అంటూ ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ దారుణ మారణ కాండలో తాను చనిపోకపోవడానికి కారణం పగ తీర్చుకోవడానికేనని ఆయన నమ్మారు.
కిరాతకుడి హత్య
డయ్యర్‌ను చంపడమే ఆశయంగా పెట్టుకున్న ఉద్దంకు భగత్ సింగ్ పోరాట ధోరణి స్ఫూర్తినిచ్చింది. అనంతరం 1924లో ఆయన గదర్ పార్టీలో చేరి విదేశాల్లో సేవలనందించారు. భగత్ సింగ్ ఆదేశాల మేరకు 1927లో ఆయన ఇండియాకు తిరిగి వస్తూ తనతో పాటు ఆయుధాలను కూడా తెచ్చారు. అనంతరం బ్రిటిషర్‌లు అక్రమాయుధాలున్నాయంటూ ఆయన్ను అరెస్టు చేసి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. విడుదలైన తర్వాత పోలీసుల దృష్టి నుంచి తప్పించుకొని మొదట జర్మనీకి, తర్వాత లండ¯Œ కు వెళ్లి ఉద్యోగం వెతుక్కున్నారు.
ఇవన్నీ జరుగుతుండగానే మరోవైపు డయ్యర్ హత్యకు ప్రణాళిక రచించుకున్నారు. ఎన్నాళ్లుగానో ఉద్దం ఎదురు చూసిన అవకాశం చివరికి 1940 మార్చి 13న లభించింది. లండన్ లోని కాక్సటన్ హాల్‌లో జరిగిన సమావేశానికి డయ్యర్ హాజరయ్యాడు. ఇదే సభకు ఉద్దం సైతం ఒక తుపాకీతో హాజరయ్యారు. మీటింగ్ ముగియగానే డయ్యర్ డయాస్ మీదకు వెళుతుండగా సూటిగా రెండుసార్లు కాల్పులు జరిపారు. దీంతో అక్కడిక్కడే ఆ కిరాతక సైనికాధికారి మరణించాడు. అనంతరం పోలీసులు ఉద్దంను అదుపులోకి తీసుకున్నారు.
రామ్ మహ్మద్ సింగ్ అజాద్
విచారణ కాలంలో ఉద్దం తన పేరును రామ్ మహ్మద్ సింగ్ ఆజాద్ అని భారత్‌లోని మతాలన్నీ కలిసివచ్చేలా పేరు మార్చుకున్నారు. డయ్యర్ హత్యకు కారణాలేంటని పోలీసులు ప్రశ్నించగా ‘‘నాకు అతనిపై పగ ఉంది. అతనికి తగిన శిక్ష పడాలి, అందుకే రెండు బుల్లెట్లు దింపాను!’’ అని ఉద్దం సమాధానమిచ్చారు.
విచారణలో ఉన్నప్పుడు ఆయన 42 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. దీంతో పోలీసులు బలవంతంగా ఆయనకు ఆహారమిచ్చారు. 1940 జూన్ 4 న ఉద్దం కేసు తుది విచారణ జరిగింది. ఆయన తరఫున కృష్ణ మీనన్ , జాన్ హచిసన్ వాదించారు. జస్టిస్ అటికిన్‌సన్ కేసును విచారిస్తూ, ఉద్దంను ప్రశ్నించినప్పుడే.. పైన పేర్కొన్న ప్రసంగం చేశారు. నా దేశం కోసం నేను చనిపోతున్నాను, నాకు ఎలాంటి విచారం లేదు... అని ధైర్యంగా ప్రకటించారు. విచారణ అనంతరం జూలై 31న ఉద్దంకు ఉరిశిక్షను అమలు చేశారు. ఈ యుద్ధ వీరుడి త్యాగాన్ని, ఆవేదనను అంతర్జాతీయ పత్రికలన్నీ అర్థం చేసుకొని ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. 1940లో ఉద్దం చర్యను మతిలేనిదని వర్ణించిన నెహ్రూ 1962లో తన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని, ఉద్దం త్యాగాన్ని కొనియాడారు.
– దుర్గరాజు శాయి ప్రమోద్
Comments
Please login to add a commentAdd a comment