సాక్షి ప్రతినిధి, చెన్నై: నీట్ ప్రవేశపరీక్ష తీరుతో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈతిబాధలపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం నియమించిన విచారణ బృందాన్ని రద్దు చేయాలన్న బీజేపీ నేత పిటిషన్‌కు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. విచారణ జరపడంలో తప్పులేదని పేర్కొంటూ పిటిషన్‌ను కోర్టు మంగళవారం కొట్టివేసింది. వివరాలు... వైద్య విద్యలో ప్రవేశానికి కేంద్రప్రభుత్వం 2019లో ప్రవేశపెట్టిన నీట్ పరీక్షలో గట్టెక్కెడం తమిళనాడులోని పేద, గ్రామీణ విద్యార్థులకు తీవ్రకష్టతరంగా మారింది. నీట్ ఫెయిలైన విద్యార్థుల్లో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ నీట్ ప్రవేశపరీక్షను వ్యతిరేకించాయి. ఆందోళనలు చేపట్టి నీట్ రద్దు చేయాలని నినదించాయి.
ఈ క్రమంలో కొన్ని విద్యార్థి సంఘాలు కోర్టుల్లో పిటిషన్లు వేశాయి. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న ఈ వ్యతిరేకత రాజకీయ ముడిసరుకుగా మారింది. డీఎంకే అధికారంలోకి వస్తే నీట్ ప్రవేశపరీక్ష రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకుంటామని గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు నీట్ వల్ల విద్యార్థిలోకం, వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న కష్టనష్టాలను విచారించించేందుకు రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే రాజన్ నేతృత్వంలో తొమ్మిది మంది సభ్యులతో కూడిన బృందాన్ని సీఎం స్టాలిన్ నియమిస్తూ గతనెల 10వ తేదీన ఉత్తర్వులు జారీచేశారు. ఈ జీఓను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురు నాగరాజన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో... ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు నీట్ వ్యవహారంలో బృందం ఏర్పాటుపై సుప్రీంకోర్టు అనుమతి పొందారా అని ప్రశ్నను లేవనెత్తింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు వీలులేదని వ్యాఖ్యానించింది. అంతేగాక ఈ కేసుకు సంబంధించి బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ దాఖలు చేసిన పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి.
నీట్ ప్రవేశపరీక్షకు సంబంధించిన చట్టాల అమలుపై కేంద్రం పర్యవేక్షణ ఉన్నందున తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడు ప్రభుత్వం నియమించిన ఏకే రాజన్ విచారణ బృందం సుప్రీంకోర్టు తీర్పుకు భంగకరం. రాష్ట్ర పరిధిలోని అంశాలపై మాత్రమే విచారణ బృందం నియమించుకునే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి ఉంది. నీట్ ప్రవేశపరీక్ష తీరుపై విచారణ జరపడం రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిదాటి ప్రవర్తించడమే అవుతుందని పేర్కొంది.
ఈ క్రమంలో... మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. నీట్ ప్రవేశపరీక్ష వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు ఎంతమాత్రం విరుద్ధం కాదు. వివరాలు సేకరించి నివేదికను సమర్పించాలని కోరిందేకానీ అంతకు మించి మరేమీ లేదు. విద్యార్థుల ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలు నివేదికలో బయటపడితే వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్లి మార్పులకు సూచించవచ్చు.
అంతేకాదు... విచారణ బృందం ఏర్పాటు వృథా ఖర్చని భావించడానికి వీలులేదు. ప్రభుత్వం నిర్వహించే ప్రజాభిప్రాయసేకరణలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదు. రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వంలోని విచారణ బృందంపై నిషేధం విధించడానికి వీలులేదని తీర్పు చెప్పింది. గురు నాగరాజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సీఎం స్టాలిన్ స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న బీజేపీ, అన్నాడీఎంకేకు ఈ తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.
నేడే నివేదిక సమర్పణ:
కోర్టు తీర్పు రాష్ట్రప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో రిటైర్డ్ న్యాయమూర్తి ఏకే రాజన్ బృందం బుధవారం తమ నివేదికను సీఎం స్టాలిన్‌కు సమర్పించనుంది. నీట్‌కు వ్యతిరేకంగా, అనుకూలంగా 89,342 మంది విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఈ బృందం అభిప్రాయాలను సేకరించింది. ఈ అభిప్రాయాలపై పలు దఫా విశ్లేషణ సమావేశాలు పూర్తి చేసి సిద్ధం చేసిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. సెప్టెంబర్12వ తేదీన నీట్ ప్రవేశపరీక్ష జరగనుండగా ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులు ఇప్పటికే దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment