పడి లేచిన కెరటం జాహ్నవి గోస్వామి(ఫొటో కర్టెసీ: హ్యూమన్స్ ఆఫ్ బాంబే)
వెబ్‌డెస్క్: అన్యోన్య దాంపత్యానికి తొలి మెట్టు నమ్మకం... దాపరికాలు, అరమరికలు లేకుంటేనే సంసారం సాఫీగా సాగిపోతుంది.. కానీ పెళ్లి అనే బంధమే అబద్ధంతో మడిపడితే... అది కూడా ఒక భర్త భార్య దగ్గర అస్సలు దాచకూడని విషయం దాస్తే... దాని కారణంగా ఆమె కన్నబిడ్డను కోల్పోవాల్సి వస్తే.. ఆ స్త్రీ పడే వేదన వర్ణనాతీతం. అస్సాంకు చెందిన జాహ్నవీ గోస్వామి ఇలాంటి బాధను అనుభవించారు. అయితే, భర్త కారణంగా హెచ్‌ఐవీ బారిన పడిన ఆమె.. అందరిలా కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు సాగారు. తనలాంటి ఎంతో మంది బాధితులకు అండగా నిలుస్తున్నారు. తన ఆశ్రమంలో ఉన్న చిన్నారులతో ‘అమ్మా’ అని పిలిపించుకుంటూ, వారి కేరింతల్లో తన కూతుర్ని చూసుకుంటున్నారు. ఎంతో మందికి ఆదర్శప్రాయురాలైన జాహ్నవి గురించిన వివరాలు ఆమె మాటల్లోనే..
17 ఏళ్లకే పెళ్లి..
‘‘పదో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. పదిహేడేళ్లకు పెళ్లి. పెద్దలు కుదిర్చిన వివాహం మాది. మావారు ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడేవారు. ఎందుకిలా అవుతుంది అని అడిగినందుకు నన్ను తీవ్రంగా తిట్టి, కొట్టి హింసించేవారు. కానీ, ఒకరోజు ఆయన వేసుకుంటున్న టాబ్లెట్లు నా కంటపడ్డాయి. ఇవేంటని ప్రశ్నించాను. విటమిన్ టాబ్లెట్లు అన్నారు. అయినా, నాకెందుకో అనుమానం తీరలేదు.
ఇలా కాలం సాగిపోతుండగా... గర్భవతిని అయ్యానన్న విషయం తెలిసింది. అమ్మ కాబోతున్నానన్న సంతోషం ముందు ఈ బాధలేమీ పట్టించుకోలేదు. కానీ, ఎప్పుడైతే ఆడబిడ్డకు జన్మనిచ్చానని తెలిసిందో.. నా భర్త ఆస్పత్రికి వచ్చి మరీ నన్ను తీవ్రంగా కొట్టారు. కేవలం మగ పిల్లాడిని కనేందుకే నన్ను పెళ్లి చేసుకున్నానంటూ ఇష్టం వచ్చినట్లు తిట్టారు. 3 నెలలకు మళ్లీ ఆయనకు అనారోగ్యం. ఈసారి డాక్టర్లు భయంకరమైన నిజం చెప్పారు. నా భర్తకు ఎయిడ్స్ సోకింది.
పర స్త్రీలతో లైంగిక సంబంధాలు..
ఈ విషయం గురించి నిలదీశాను. పెళ్లికి ముందే ఆయనకు ఈ విషయం తెలుసట. బిజినెస్ ట్రిప్పులకు వెళ్లినపుడు చాలా మంది స్త్రీలతో లైంగిక సంబంధాలు పెట్టుకున్నారట. కానీ కుటుంబ సభ్యుల ఒత్తిడితో మా వాళ్ల దగ్గర నిజం దాచి నన్ను వివాహం చేసుకున్నారట. అది కూడా అబ్బాయికి జన్మనిస్తే వారి వంశం నిలబడుతుందనే ఆశతో.. నా గుండె ముక్కలైంది. ఈ చేదు నిజాన్ని జీర్ణించుకునేలోపే నా భర్త చనిపోయాడు. అంతలోనే మరో షాక్.. ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటే నాకూ, నా కూతురు కస్తూరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది.
నా ప్రపంచం చీకటైపోయింది..
నా బిడ్డను ఒడిలో పెట్టుకుని ఎంతలా ఏడ్చానో నాకే తెలుసు. అత్తింటి వారు మమ్మల్ని పట్టించుకోలేదు. పైగా వేధింపులకు గురిచేశారు. విధిలేక పుట్టింటికి చేరాను. నేను ఉన్నానని తెలిసి చాలా మంది మా ఇంటికి రావడమే మానేశారు. దీంతో దుఃఖం పొంగుకొచ్చింది. నేనూ, నా బిడ్డ ఆస్పత్రిలో చేరాం. అక్కడ డాక్టర్లకు కూడా హెచ్‌ఐవీ పేషెంట్లకు ముట్టుకోవడం అంటే భయమే. ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్న సమయంలో.. కస్తూరికి టీబీ వచ్చింది. రెండేళ్ల వయసులో తను నా నుంచి శాశ్వతంగా దూరమైంది. నా ప్రపంచం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
సరైన చికిత్స లేని కారణంగా నా బిడ్డను కోల్పోవాల్సి వచ్చిందని కోర్టులో కేసు వేశాం. నా గురించి ఈ విషయాలన్నీ తెలిసి, మా స్కూల్ ప్రిన్సిపల్ నన్ను కలవడానికి వచ్చారు. నా టీచర్లను కూడా తీసుకువచ్చారు. నా మనసు కస్తూరి జ్ఞాపకాల నుంచి పుస్తకాల వైపు మళ్లేలా చేశారు. నా అక్కాచెల్లెళ్లు వారు కూడబెట్టుకున్న డబ్బుతో నన్ను చదివించారు. అలా సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేశాను. కానీ హెచ్‌ఐవీ ఉన్న కారణంగా నన్ను ఎవరూ ఉద్యోగంలోకి తీసుకోలేదు.
ఒక్క నెలలో 13 ఇళ్లు మారాల్సి వచ్చింది. అప్పుడే హైకోర్టులో నా పిటిషన్ విచారణకు వచ్చింది. కూతురి మరణానికి నష్టపరిహారంగా 2 లక్షల రూపాయలా లేదంటే, ఉద్యోగమా ఈ రెండు ఆప్షన్లను నా ముందు ఉంచింది. నేను రెండోదాన్నే ఎన్నుకున్నాను. అస్సాం రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సొసైటీలో హెచ్‌ఐవీ పేషెంట్లకు కౌన్సిలింగ్ ఇచ్చే ఉద్యోగానికి కుదిరాను. పేషెంట్ల తరఫున పోరాడాను.
అమ్మా అన్న పిలుపే అమితానందం
నా సేవలు వినియోగించుకున్న ఎంతో మంది నా దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్పేవారు. సేవా కార్యక్రమాలు మరింత విస్త్రృతం చేయాలనే సంకల్పంతో 2004లో అస్సాం నెట్‌వర్క్ ఆఫ్ పాజిటివ్ పీపుల్ అనే సంస్థను నెలకొల్పాను. ఇందులో హెచ్‌ఐవీ పేషెంట్లే వాలంటీర్లు. ఈ వ్యాధి బారిన చిన్నారుల కోసం.. నా కూతురు కస్తూరి జ్ఞాపకార్థం అనాథాశ్రమాన్ని స్థాపించాను. వారి చదువు, పోషణ, చికిత్సకు అయ్యే ఖర్చును మా సంస్థ చెల్లిస్తుంది.
ప్రతి ఏడాది కస్తూరి పుట్టిన రోజు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేస్తాను. పేషెంట్లకు నిత్యావసర వస్తువులు పంపిస్తాను. అయితే, వీటన్నింటి కంటే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చే విషయం ఏమిటంటే.. ఆ పిల్లలంతా నన్ను ‘అమ్మా’ అని పిలవడమే’’ అని తన జీవితంలో జరిగిన ఘటనల గురించి జాహ్నవి హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రాల్లో హెచ్‌ఐవీ పేషెంట్ అన్న విషయం బహిర్గతం చేసిన తొలి మహిళగా ఆమె నిలిచారు. ‘‘హెచ్‌ఐవీ పాజిటివ్ అయిన వాళ్లు.. జీవితంలో ఎందుకు పాజిటివ్(సానుకూలంగా) ఉండకూడదు. అలాంటి మార్గాన్ని ఎందుకు ఎంచుకోకూడదు’’ అనేది ఆమె తరచూ చెప్పే మాట.
Comments
Please login to add a commentAdd a comment