ఉదయం 9.51 గంటలకు సుముహూర్తంగా నిర్ణయం
పర్యవేక్షణ కమిటీ సమావేశంలో నిర్ణయం
భువనేశ్వర్: పూరీ శ్రీజగన్నాథుని రత్న భాండాగారం మరోసారి తెరవనున్నారు. ఈసారి కూడా శుభ ఘడియల్లో తెరిచేందుకు నిర్ణయించారు. రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షణ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 18వ తేదీ ఉదయం 9.51 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల మధ్య ఈ సన్నాహాలు చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన 11 మంది సభ్యుల కమిటీ అత్యవసర సమావేశం శ్రీమందిర్ కార్యాలయంలో మంగళవారం జరిగింది. కమిటీ సభ్యులందరూ సమావేశంలో పాల్గొని వివరంగా చర్చించారు. శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి (సీఏవో) డాక్టర్ అరవింద కుమార్ పాఢి సమావేశం వివరాలు మీడియాకు వివరించారు.
సురక్షితంగా ఆభరణాల తరలింపు
రత్న భాండాగారంలో ఆభరణాలు వగైరా సురక్షితంగా తరలించడమే ప్రధాన అజెండాగా చర్చ కొనసాగింది. సమావేశ నిర్ణయం మేరకు ఈనెల 18న మళ్లీ ఆలయంలోని రత్న భాండాగారం తెరిచి లోపల ఉన్న ఆభరణాలను తరలిస్తారు. ప్రధాన ఆలయం సముదాయంలోని తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లోపలికి పకడ్బందీ వ్యవస్థ మధ్య తరలిస్తారు. ఈ విధానాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం జరుగుతాయి.
ఈ నేపథ్యంలో ఈనెల 14వ తేదీన తొలిసారిగా రత్న భాండాగారం తెరిచిన విషయం తెలిసిందే. వెలుపలి గది పర్యవేక్షణ ముగించి ఆభరణాలు వగైరా తొలగించి ఖాళీ చేశారు. లోపలి గది తాళాలు తెరిచేందుకు విఫలయత్నం చేశారు. నకిలీ తాళం చెవిలతో తాళాలు తెరవకపోవడంతో విరగగొట్టి, గదిలోనికి ప్రవేశించినట్లు సీఏవో మరోసారి గుర్తు చేశారు. కానీ సమయాభావం వల్ల ఆభరణాల తరలింపు ప్రక్రియ చేపట్టకుండా పొడిగించారు. లోపల గదికి 3 తాళాలు వేసినట్లు గుర్తించారు. వాటిలో ఒకటి సీల్ వేసి ఉండగా, మిగిలిన రెండు సీలు లేకుండా ఉన్నట్లు రత్న భాండాగారం తనిఖీ ఉన్నత స్థాయి పర్యవేక్షక కమిటి బృందం గుర్తించింది. పాత తాళాలు విరగ్గొట్టడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో రెండు కొత్త తాళాలు వేసి సీల్ చేసి, వాటి తాళం చెవిలు ట్రెజరీలో జమ చేశారు.
మరమ్మతులకు అప్పగింత
రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం వెలుపలి మరియు లోపలి గదుల్లో రత్నాల వస్తువుల తరలింపు పూర్తయ్యి, ఖాళీ చేసిన తర్వాత వాటి మరమ్మతుల కోసం భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ)కి అప్పగిస్తారు. పురావస్తు శాఖ మరమ్మతులు పూర్తి చేశాక తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌లోని ఆభరణాలన్నింటినీ తిరిగి రత్న భాండాగారంలో యథాతథంగా భద్రపరిచేందుకు తరలిస్తారు. తాజాగా జారీ అయిన మార్గదర్శకాల ప్రకారం రత్న సంపద అన్ని లెక్కలు మరియు అంచనాలు జరుగుతాయని శ్రీమందిరం ప్రధాన పాలన అధికారి డాక్టర్ అరవింద్ కుమార్ పాఢి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment