ధాన్యం కొనాలని ఆందోళన
కుంటాల: ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామ రైతులు గురువారం రోడ్డెక్కారు. కుంటాల మండలం 61వ జాతీయ రహదారిపై అర్లి(కె) క్రాస్ రోడ్డు వద్ద రాస్తారోకో చేశారు. ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం నిర్వాహకులు ఆరు లారీల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ గోదాంకు తరలించారు. తరుగును రైతులే భరించాలని గోదాం నిర్వాహకులు చెప్పడంతో ఐకేపీ నిర్వాకులు ధాన్యం కొనుగోళ్లు నిలిపివేశారు. రెండు రోజుల క్రితం కొనుగోళ్లు ప్రారంభించి భైంసా మండలం వానల్‌పాడ్ రైస్‌మిల్‌కు తరలించారు. మిల్ యజమాని బస్తాకు 43 కిలోల చొప్పున తూకం వేసి తీసుకుంటానని చెప్పారు. దీంతో రైతులు బస్తాకు 42 కిలోలు మాత్రమే ఇస్తామని తెలుపడంతో బుధవారం మళ్లీ కొనుగోళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు న్యాయం చేయాలని కోరుతూ అర్లి(కె) క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న లోకేశ్వరం తహసీల్దార్ అర్క తుకారాం అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ససేమిరా అన్నారు. భైంసా ఆర్డీవో కోమల్‌రెడ్డి ఘటన స్థలికి చేరుకుని రైతులు చెప్పిన విధంగానే బస్తాకు 42 కిలోలు తూకం వేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రైతులకు న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు. మూడు గంటల పాటు ఆందోళన చేయడంతో రోడ్డు కిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. భైంసా, నిర్మల్ రూరల్ సీఐలు నైలు నాయక్, రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్సైలు భాస్కరాచారి, హన్మాండ్లు, అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment