‘సహకారం’ మరింత చేరువ!
లక్ష్మణచాద పీఏసీఎస్ కార్యాలయం
నిర్మల్‌చైన్‌గేట్: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రీఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి రెండో వారంలో ముగియనుంది. ఈలోపే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనిపై కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సహకార శాఖ కోరింది.
సేవల విస్తరణకు..
జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 17 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 56,037 సభ్యులు ఉన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల విక్రయాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోళ్లు, పంట రుణాల పంపిణీ, గిడ్డంగులు, పెట్రోల్ బంకులతోపాటు పలు సేవలు రైతులకు అందిస్తున్నారు. కొత్తగా మండలాలు ఏర్పడినప్పటికీ మండల కేంద్రాల్లో పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయలేదు. ఈ క్రమంలో అన్ని మండల కేంద్రాలతోపాటు అవసరం ఉన్న గ్రామాల్లో సహకార సంఘాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
2013 తర్వాత కొత్త కేంద్రాలు లేవు..
చాలా మండలాల్లో ఒకటి, రెండు ఉండడం.. కొన్ని చోట్ల అసలే లేకపోవడం, మరికొన్ని చోట్ల నాలుగు, మూడు గ్రామాలకు కలిపి సహకార సంఘాలు ఉన్నాయి. సహకార సంఘాలు అందుబాటులో లేక రైతులకు సేవలు సక్రమంగా అందడం లేదు. 2013 తరువాత కొత్తగా సహకార సంఘాలు ఏర్పాటు కాలేదు. అయితే.. 2023 లోనే కొత్త సహకారం సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు లేఖలు రాసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర సహకార శాఖ ప్రతిపాదనలు కోరింది. జిల్లా సహకార శాఖ ఇప్పటికే 8 కొత్తగా సంఘాలకు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపింది. మరో 6 కొత్త సంఘాల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా అవి పరిశీలనలో ఉన్నాయి.
ఫిబ్రవరి 19న ముగియనున్న పదవీకాలం..
కొత్త సొసైటీల ఏర్పాటు ప్రక్రియను చేపట్టిన సహకార శాఖ ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తోంది. జిల్లాలో ఉన్న సంఘాలను విభజించి కొత్త వాటిని ఏర్పాటు చేయాలా? లేక కొత్త సభ్యులతో సంఘాలు ఏర్పాటు చేయాలా అనే కోణాల్లో ఆలోచన చేస్తోంది. అయితే ఉన్న వాటినే విభజన చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మండలానికి కనీసం రెండు కొత్త సాసైటీలు ఉండాలనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గ్రామాల నుంచి ఇబ్బందులు, అభ్యంతరాలు తలెత్తకుండా ఎమ్మెల్యేలు పరిశీలన చేయనున్నారు. ఎమ్మెల్యేలు ఫైనల్ చేసినవే కొత్త సొసైటీలుగా ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుత సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 19న ముగుస్తుంది. ఈలోపే కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
పరిశీలనలో ఉన్న దరఖాస్తులు
మండలం గ్రామం
సోన్ జాఫ్రాపూర్
లక్ష్మణచాంద వడ్యాల్
లక్ష్మణచాంద ధర్మారం
సారంగపూర్ జామ్
సారంగపూర్ బీరవెల్లి
నిర్మల్ రూరల్ వెంగ్వాపేట్
ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపిన కొత్త సహకార సంఘాలు
మండలం గ్రామం
ఖానాపూర్ పెంబి
నర్సాపూర్(జి) నర్సాపూర్(జి)
కడెం దస్తురాబాద్
సోన్ సోన్
ముధోల్ ముధోల్
తానూర్ బెల్తారోడా
కుభీర్ మాలేగాం
మామడ పొన్కల్
పీఏసీఎస్‌ల రీఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం చర్యలు
జిల్లాలో ప్రస్తుతం 17 ప్రాథమిక సహకార సంఘాలు
కొత్తగా 8 సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదన
అధికారుల పరిశీలనలో మరో ఆరు..
రైతులకు చేరువయ్యేందుకు..
రైతులకు సేవలు మరింత చేరువ చేసేందుకు మరిన్ని కొత్త పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో కొత్తగా 8 పీఏసీఎస్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించాం. మరో ఆరు ప్రతిపాదన దశలో ఉన్నాయి. భౌగోళిక పరిస్థితులు, రైతుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌ల పరిధి, గ్రామాల మధ్య దూరం తదితర అంశాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
– పాపయ్య, జిల్లా సహకార అధికారి
Comments
Please login to add a commentAdd a comment