ఈ ఏడాది 277 టీఎంసీల వరద నీరు
బాల్కొండ: ఉత్తర తెలంగాణ జిల్లాల వర ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లోకి ఈ సంవత్సరం ఇప్పటి వరకు 277 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి ఇంకా 7 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. గత జూన్ నుంచే ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రారంభమైంది. సెప్టెంబర్‌లో అధికంగా 154 టీఎంసీల నీరు వచ్చింది. దీంతో ప్రాజెక్ట్ నుంచి సెప్టెంబర్‌లో వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటి విడుదలను ప్రారంభించారు. అలా మొత్తం 100 టీఎంసీల కంటే ఎక్కువే గోదావరి పాలైంది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గత నెల 29న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మూసి వేశారు. దీంతో ఎగువ మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వరదలకు బ్రేకు పడింది.
మరో వారం రోజుల్లో..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి మరో వారం రోజుల్లో ఖరీఫ్ సీజన్ కోసం కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల నిలిపి వేసే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత సంవత్సరం యాసంగి సీజన్ ప్రారంభం వరకు ప్రాజెక్ట్ నిండుకుండలా ఉండే అవకాశం ఉంది. యాసంగి పంటలకు ప్రణాళిక ప్రకారం డిసెంబర్ మధ్య మాసం నుంచి నీటి విడుదల చేపడుతారు. అప్పటి వరకు ఎగువ ప్రాంతాల నుంచి స్వల్ప వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని ప్రాజెక్ట్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న నీటి విడుదల..
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి ఆయకట్టుకు కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. కాకతీయ కాలువ ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 571 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా గురువారం ప్రాజెక్ట్ అధికారులు నీటి విడుదలను నిలిపి వేశారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా అంతే స్థాయి నీటి మట్టంతో ప్రాజెక్ట్ నిలకడగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు.
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరద
గతేడాది కంటే ఎక్కువే
గతేడాది 208 టీఎంసీలు
ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుత సంవత్సరం గతేడాది కంటే ఎక్కువ వరద నీరు వచ్చి చేరింది. గతేడాది ప్రాజెక్ట్‌లోకి 208 టీఎంసీల వరద నీరు మాత్రమే వచ్చింది. ఈసారి 277 టీఎంసీల వరద నీరు వచ్చింది. ఈ సంవత్సరం జూన్‌లో 3.99 టీఎంసీలు, జూలైలో 27.52 టీఎంసీలు, ఆగస్టులో 33.48 టీఎంసీలు, సెప్టెంబర్‌లో 154.43 టీఎంసీలు, అక్టోబర్‌లో 57.16 టీఎంసీల వరదనీరు ప్రాజెక్టులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment