అప్‌గ్రేడ్ చేసినా పాత వేతనమే..
మోర్తాడ్(బాల్కొండ): మినీ అంగన్‌వాడీలను మెయిన్ అంగన్‌వాడీలుగా అప్‌గ్రేడ్ చేసినా వారి వేతన పెంపును ప్రభుత్వం మరిచింది. చేసే పనిలో తేడా ఏమి లేకపోయినా వేతనం విషయంలోనే తమకు అన్యాయం జరుగుతోందని మినీ అంగన్‌వాడీ టీచర్లు వాపోతున్నారు. జిల్లాలో 1,500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, 1,145 మంది కార్యకర్తలను మెయిన్‌గా, 135 మందికి మినీ అంగన్‌వాడీలుగా గుర్తింపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను అప్‌గ్రేడ్ చేస్తూ జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది.
పెంచిన వేతనంతోపాటు ఇతర సౌకర్యాలను మాత్రం ఏప్రిల్ 2024 నుంచి వర్తింపజేయనున్నట్లు పేర్కొంది. మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ.13,500, మినీ అంగన్‌వాడీలకు రూ.7,500 వేతనం చెల్లించేవారు. అప్‌గ్రేడ్ చేయడంతో అందరికి సమానమైన వేతనం లభించే అవకాశం ఏర్పడింది. ఏప్రిల్, మే నెలల్లో రూ.13,500 వేతనం అందింది. ఆ తరువాత ఐదు నెలలు మాత్రం పాత లెక్క ప్రకారమే వేతనాన్ని ఖాతాల్లో జమ చేశారు. ఆర్థిక శాఖ(ట్రెజరీ)లో సాంకేతిక సమస్య కారణంగా మినీ అంగన్‌వాడీలుగా పని చేసిన వారికి పాత వేతనం జమవుతోందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించి పనికి తగిన వేతనం చెల్లించే ఏర్పాట్లు చేయాలని అంగన్‌వాడీలు కోరుతున్నారు.
మినీ అంగన్‌వాడీలకు మెయిన్
అంగన్‌వాడీలుగా గుర్తింపు
పాత వేతనంతోనే సరిపెడుతున్న ప్రభుత్వం
ట్రెజరీలో సాంకేతిక సమస్యే కారణం
నష్టపోతున్న అంగన్‌వాడీ టీచర్లు
సమస్యను పరిష్కరించాలి
మినీ అంగన్‌వాడీ కార్యకర్తలను అప్‌గ్రేడ్ చేసినా పాత వేతనమే చెల్లిస్తున్నారు. ట్రెజరీలోని సాంకేతిక సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని అప్‌గ్రేడ్ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు న్యాయం చేయాలి. అధికారులకు ఎన్నోసార్లు వినతి పత్రాలను అందించాం.
– దేవగంగు, అంగన్‌వాడీ
కార్యకర్తల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
అంతటా ఇదే సమస్య
అప్‌గ్రేడ్ చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలను పెంచలేదు. మొదట్లో రెండు నెలలు కొత్త వేతనం మంజూరు చేశారు. ఆ తరువాత సాంకేతిక సమస్య కారణంగా పాత వేతనమే లభిస్తుంది. ఉన్నతాధికారులకు ఈ సమస్యను విన్నవించాం. రాష్ట్ర స్థాయిలోనే సమస్య నెలకొనడంతో పరిస్థితిలో మార్పు లేదు.
– రసూల్‌బీ, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి
Comments
Please login to add a commentAdd a comment