స్ఫూర్తిదాయక ప్రస్థానం..
ఆర్మూర్: చిరు ప్రాయంలో భిక్షాటన చేసిన బాలుడు చదువును నమ్ము కొని పోలీసు శాఖలో డీఎస్పీ స్థాయికి ఎదిగాడు. తర్వాత యువత రాజకీయాల్లో రాణిస్తేనే మార్పు సాధ్యమ ని భావించి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మదనం గంగాధర్ జీవిత ప్రస్థానం నేటి యువతరానికి స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం రాజారాం నగర్ కాలనీలోని సంచార జాతికి చెందిన మదనం రాజలింగం, గంగమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు.. వారిలో మొదటి వాడైన గంగాధర్ పేదరికం కారణంగా బాల్యంలో భిక్షాటన చేయడంతోపాటు బాల కార్మికుడిగా, న్యూస్ పేపర్ బాయ్‌గా, వీధుల్లో పెప్సీ అమ్మి, కూలీ పనులు చేసి రాత్రి వేళల్లో విద్యనభ్యసించాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల విద్య పూర్తి చేసిన అనంతరం 1994–97 బ్యాచ్ లో జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించాడు. 1998లో 22 ఏళ్ల ప్రాయంలో ఎస్సై గా ఉద్యోగం సాధించడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 2010 లో నల్గొండలో సీఐ గా తరువాత డీఎస్పీగా పదోన్నతులు పొందాడు. 26 సంవత్సరాల పోలీస్ సర్వీసులో ఒక్క మెమో కూడా తీసుకోకుండా నిబద్ధతతో విధులు నిర్వహించిన ఫలితంగా కఠిన సేవా పతకం, ఉత్తమ సేవా పతకంతో పాటు సుమారు 200 సార్లు వివిధ ప్రశంసా పత్రాలు, అవార్డులను పొందాడు. నల్గొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 పోలీస్ స్టేషన్లలో ఎస్‌హెచ్‌వో గా విధులు నిర్వహించి విధి నిర్వహణలో తనకంటూ ప్రత్యేకత సాధించాడు. హైదారాబాద్ పోలీసు విభాగంలోని సిట్ (ఎస్‌ఐటీ)లో విధులు నిర్వహించే క్రమంలో టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ లో నిందితులను గుర్తించడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా హైదారాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ)లో డీఎస్పీగా బాధ్యతలు నిర్వహించాడు. ఇక్కడే తన డీఎస్పీ పదవికి ఇటీవల వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం తన 26 సంవత్సరాల పోలీస్ ఉద్యోగాన్ని స్వచ్ఛందంగా వదిలి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ గా పోటీకి నిలవనున్నాడు. సమాజం, యువత, నిరుద్యోగులు, పోలీసు శాఖలో సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న తాను ఎన్నికల్లో విజయం సాధించి పెద్దల సభకు వెళ్లి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
భిక్షమెత్తే స్థాయి నుంచి డీఎస్పీ వరకు..
ఎమ్మెల్సీ బరిలోకి ఆర్మూర్‌కు చెందిన మదనం గంగాధర్
Comments
Please login to add a commentAdd a comment