రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించాలి
● కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు
మాక్లూర్: కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన వరి ధాన్యం డబ్బులను రైతులకు సకాలంలో ఇవ్వాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం మాక్లూర్ మండలం ఒడ్డెట్‌పల్లి గ్రామంలో అమ్రాద్ సొసైటీ ఽఆధ్వర్యంలో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు పరిశీలించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం ఏ మేరకు రైస్‌మిల్లులకు తరలించారు, బిల్లుల చెల్లింపులు ఎంత వరకు జరిగాయి వివరాలను సొసైటీ కార్యదర్శి గుండేటీ గంగారాంను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం రైస్‌మిల్లులకు తరలిన అనంతరం మిల్లర్లు కడ్తా పేరిట తరుగు తీస్తున్నారా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత ఏఈవోలు ధ్రువీకరణ పత్రాలను జతపరుస్తూ అన్‌లైన్లో సన్న ధాన్యం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. సరిపడా గన్నీ బ్యాగులు ఉంచుకోవాలన్నారు. ఇప్పటికే 70 శాతం ధాన్యం సేకరణ జరిగినందున కొనుగోలు పక్రియను మరింత వేగం పెంచాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు. వెంటవెంటనే రైతులకు రైస్‌మిల్లర్ల నుంచి డబ్బులు వచ్చేలా చూడాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదన్నారు. కలెక్టర్ వెంట డీసీవో శ్రీనివాస్, తహసీల్దార్ శేఖర్, అమ్రాద్ విండో కార్యదర్శి గంగారాం, రైతులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment