కొనుగోలు కేంద్రాలకు కమీషన్ కష్టాలు
మోర్తాడ్(బాల్కొండ): ధాన్యం కొనుగోలు కేంద్రాలను కమీషన్ కష్టాలు వెంటాడుతున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యానికి కమీషన్ చెల్లించడంలో జాప్యం కారణంగా కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరలోని రెండు సీజన్‌ల కమీషన్ రూ.35,03,76,708 జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు జమ కావాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రెండు సీజన్‌ల ధాన్యం సేకరించినప్పటికీ గన్నీ సంచుల స్వాధీనం, లెక్కలు చేయకపోవడంతో కమీషన్ ఎంతో ఇంకా తేలలేదు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే గడిచిన రెండు సీజన్‌లలోనూ రూ.35 కోట్లకు పైగానే కమీషన్ జమ కావాల్సి ఉంటుందని తెలుస్తోంది. వర్షాకాలం, యాసంగి సీజన్‌లలో ధాన్యం కొనుగోళ్లు జోరుగానే సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని సహకార సంఘాలతోపాటు, మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలోనూ ధాన్యం కొనుగోళ్లు సాగుతున్నాయి. దొడ్డు రకాలను గతంలో ఎక్కువగా కొనుగోలు చేయగా, కొన్ని సందర్భాల్లో సన్న రకాలను కూడా కొనుగోలు చేశారు. ఈ సీజన్‌లో మాత్రం సన్న రకాలకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ను ప్రకటించడంతో సన్న రకాల కొనుగోళ్లలో వేగం పుంజుకుంది. ఒక్కో క్వింటాలుకు రూ.32 వరకు కమీషన్ చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ధాన్యం సేకరణను బట్టి కొనుగోలు కేంద్రాలను నిర్వహించిన సహకార సంఘాలు, మహిళా సమాఖ్యలకు భారీ మొత్తంలోనే కమీషన్ రూపంలో ఆదాయం సమకూరుతుంది. ఇది ఇలా ఉండగా సహకార సంఘాలకు కొనుగోళ్ల కమీషనే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఎరువుల వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుండటంతో ధాన్యం సేకరణ ద్వారా లభించే కమీషన్ సంఘాల నిర్వహణకు ప్రధానమైంది. ఈ నేపథ్యంలో కమీషన్ చెల్లించకపోవడంతో అనేక సహకార సంఘాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. గత ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు కొనుగోళ్ల కమీషన్‌కు సంబంధించిన నిధులను విడుదల చేయకపోవడంతో సహకార సంఘాల్లో కాసుల కొరత తీవ్రమైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ధాన్యం సేకరణ కమీషన్ సొమ్ము జమ చేయాలని పలువురు సూచిస్తున్నారు.
2022 – 23 సంవత్సరానికి
సంబంధించి రూ.35 కోట్ల బకాయిలు
తేలని మరో రెండు సీజన్‌ల లెక్కలు
కమీషన్ అందక ఇబ్బందులు
నిధులు విడుదల కావాల్సి ఉంది
కొనుగోలు కేంద్రాలకు కమీషన్‌కు సంబంధించి నిధులు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే కొనుగోలు కేంద్రాలకు వారివారి కమీషన్ డబ్బులు చెల్లిస్తాం. కొనుగోళ్లు పూర్తి చేసిన వెంటనే గన్నీ సంచులు అప్పగించి లెక్కల వివరాలను అందించాలి. అన్ని కొనుగోలు కేంద్రాల లెక్కలు అందితేనే కమీషన్ సొమ్ము ఎంత అనేది ప్రభుత్వానికి నివేదించడానికి వీలవుతుంది.
– అంబదాస్ రాజేశ్వర్,
పౌర సరఫరాల సంస్థ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment