అసలేం జరిగింది..
● ఎస్సై, మహిళా కానిస్టేబుల్, యువకుడి మరణాలపై ఎన్నో అనుమానాలు
● ఆరా తీస్తున్న పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం
చదువులో టాపర్
భిక్కనూరు: ఆత్మహత్య చేసుకున్న భిక్కనూరు ఎస్సై సాయికుమార్ చిన్నతనం నుంచి చదువులో ముందున్నారు. 2007–2008లో పదోతరగతిలో మండల టాపర్‌గా నిలిచారు. ఇంటర్‌లోనూ మంచి మార్కులు సాధించారు. హైదారాబాద్‌లోని సీబీఐటీలో కన్వీనర్ కోటాలో బీటెక్‌లో ప్రవేశం పొంది ఇంజినీరింగ్ కోర్సు పూర్తి చేశారు.
ఒకే ఏడాది మూడు ఉద్యోగాలకు ఎంపిక
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సాయికుమార్.. మంచి ఉద్యోగం సంపాదించాలన్న లక్ష్యంతో చదివారు. 2018 పోస్టల్ డిపార్టుమెంట్‌లో ఉద్యోగం సాధించారు. అదే సమయంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ వెంటనే నిర్వహించిన ఎస్సై పరీక్షలోనూ ఎంపికయ్యారు. మొదటి పోస్టింగ్ సిద్దిపేట జిల్లా చిన్నకోడురులో ఎస్సైగా చేరారు. తదుపరి బాన్సువాడలోనూ ఎస్సైగా పనిచేశారు. ఎస్సై సాయికుమార్ రెండు పర్యాయాలు ఎస్పీ సింధుశర్మ చేతులమీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. డీజిల్ దొంగలను పట్టుకోవడంతో పాటు కంచర్లలో జరిగిన హత్య కేసులో నిందితులను పట్టుకోవడంతో ఎస్పీ సింధుశర్మ అభినందించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి సాయికుమార్ ఒక్కరే తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపికయ్యారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : భిక్కనూరు ఎస్సై సాయికుమార్(32), బీబీపేట పీఎస్ కు చెందిన మహిళా కానిస్టేబుల్ శ్రుతి(30), బీబీపేటకు చెందిన తోట నిఖిల్ (29)ల ఆత్మహత్య ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎస్సై, కానిస్టేబుల్ చనిపోవడం పోలీసు శాఖలో కలకలం రేపింది. కాగా వారి మృతికి స్పష్టమైన కారణాలు తెలియడం లేదు. అసలేం జరిగి ఉంటుంది అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో పోలీసు అధికారులున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత శ్రుతి, నిఖిల్‌ల మృతదేహాలు సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోగల పెద్ద చెరువులో లభించిన విషయం తెలిసిందే. గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఎస్సై మృతదేహం లభ్యమైంది. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ముగ్గురి మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు సిబ్బంది ఎస్సై, కానిస్టేబుల్ మృతదేహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మృతదేహాలను వారి కుటుంబ సభ్యులు స్వగ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపించారు. ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పోస్టు మార్టం అనంతరం వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. వారి మరణాలకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామన్నారు.
అంతుచిక్కని కారణాలు...
ఎస్సై సాయికుమార్ స్వస్థలం మెదక్ జిల్లా కొల్చా రం మండల కేంద్రం. 2018 బ్యాచ్‌కు చెందిన ఆయన 2022 ఏప్రిల్ 13 న బీబీపేటలో ఎస్సైగా చేరారు. సుమారు 16 నెలల తర్వాత భిక్కనూరు ఎస్సైగా బదిలీ అయ్యారు. గాంధారి మండల కేంద్రానికి చెందిన శ్రుతి బీబీపేటలో 2021 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో ఇరువురి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో మృతుడు బీబీపేటకు చెందిన తోట నిఖిల్ సహకార బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూనే కంప్యూటర్ల మరమ్మతులు చేసేవాడు. పోలీసు స్టేషన్‌కు చెందిన కంప్యూటర్లు మొరాయించినపుడు వచ్చి రిపేర్ చేసి వెళ్లేవాడు. ముగ్గురి మృతదేహాలు ఒకేసారి చెరువులో లభించడంతో మృతికి కారణాలు ఏమై ఉంటాయన్న అంశంపై చర్చ నడుస్తోంది. చెరువు సమీపంలో నిలిపిన ఎస్సై కారులో శ్రుతి బ్యాగు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురు కలిసే చెరువు వద్దకు వచ్చారా, వేరువేరుగా వచ్చారా.. వీరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ముగ్గురిలో ఒకరు ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకితే.. రక్షించేందుకు మిగతా ఇద్దరు ఒకరి వెనుక ఒకరుగా వెళ్లి నీట మునిగి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది.
ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారి రోదనలు మిన్నంటాయి. ఎస్సై సాయికుమార్ తండ్రి అంజయ్య మాట్లాడుతూ తన కొడుకు కష్టపడి చదివి ఉద్యోగం సాధించాడని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. ఎవరో ఒకరిని కాపాడే ప్రయత్నంలో చనిపోయి ఉండొచ్చన్నారు. శ్రుతి తండ్రి పుండరీకం మాట్లాడుతూ తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఎలా జరిగిందనేది పోలీసులు తేల్చాలన్నారు. నిఖిల్ చనిపోయిన విషయం పోలీ సులు చెబితే తెలిసిందని అతని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అసలేం జరిగింది, ఎందుకు జరిగింది కూడా తమకు అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ గురువారం ఆస్ప త్రి వద్దకు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.
ప్రేమ వివాహం
సాయికుమార్ 2022లో కర్నూల్ జిల్లా నంద్యాలకు చెందిన మహలక్ష్మి ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. మహలక్ష్మి ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment