సొసైటీలు మరింత బలోపేతం!
● డిజిటలైజేషన్ దిశగా సహకార వ్యవస్థ
● కసరత్తు చేపట్టిన కేంద్రం
● ఆన్‌లైన్‌లో పూర్తయిన సంఘాల
వివరాల నమోదు
● జిల్లాలో 3,022 సహకార సంఘాలు
డొంకేశ్వర్(ఆర్మూర్) : సహకార వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం మార్పులు తేవాలని భావిస్తోంది. సొసైటీలను మరింత బలోపేతం చేసి వాటి ద్వారా విస్తృతంగా సేవలు అందించాలని చూస్తోంది. ఇందుకు సహకార వ్యవస్థలో డిజిటలైజేషన్ విధానాన్ని తీసుకువచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దేశమంతటా వివిధ రంగాల్లో రిజిస్టరై ఉన్న సంఘాల వివరాలను సేకరించింది. జిల్లా నుంచి కూడా సొసైటీల డేటాను సహకార శాఖ ఎన్‌సీడీసీ పోర్టల్‌లో నమోదు చేసింది. జిల్లాలో 27 రంగాల్లో కలిపి మొత్తం 3,187 సహకార సంఘాలు ఉండగా, 3,022 సంఘాల వివరాలను సెంట్రల్ సర్వర్‌లో ఎంట్రీ చేశారు. జిల్లాలో అత్యధికంగా యాక్టివ్‌గా ఉండే స్వయం సహాయక సంఘాలు 1,500 వరకు ఉండగా, మత్స్య సహకార సంఘాలు 361 ఉన్నాయి. అలాగే రైతులతో ఎక్కువ సంబంధాలు కలిగిన ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు)89 ఉన్నాయి. ఈ మూడు రంగాల్లోనే సొసైటీలు ఎక్కువగా సేవలందిస్తూ రాణిస్తున్నాయి. వీటితో పాటు హౌసింగ్, లేబర్, పౌల్ట్రీ, ఇతర రంగాల సొసైటీలు ఉన్నప్పటికీ వీటి పనితీరు పెద్దగా బయటకు కనిపించదు. ప్రజలు, రైతులతో ఎక్కువ సంబంధాలు కలిగిన సొసైటీలను బలోపేతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆలోచన చేసింది. సంఘాలను మరింత పెంచడంతో పాటు వాటి పరిధిని ప్రతి మూలకు విస్తరింజేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు తొలి అడుగుగా సహకార వ్యవస్థను డిజిటలైజేషన్ చేయాలని సహకార శాఖకు ఆదేశాలు అందాయి. ప్రతి సంఘానికి సంబంధించిన లావాదేవీలు, ఆడిట్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయడం ఇటీవల పూర్తి చేశారు. వచ్చే నూతన ఏడాదిలో సహకార వ్యవస్థలో మార్పులు తెచ్చి ఆర్థికపర సహకారాన్ని కూడా అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని సేవలను అందించాలని భావిస్తోంది. వ్యవసాయ సబ్సిడీలను కూడా సొసైటీ ద్వారానే అందించే అవకాశం ఉంది. మహిళా సంఘాలు, మత్స్యకార సొసైటీలకు సైతం సబ్సిడీలను ఇచ్చే అవకాశం ఉందని సహకార శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
డేటా ఎంట్రీ పూర్తయింది
సహకార సంఘాల బలోపేతం చేయడానికి వాటి సంఖ్యను పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సహకార వ్యవస్థను డిజిటలైజేషన్ చేయడం, డేటాను పోర్టల్‌లో నమోదు చేయించే ప్రక్రియ పూర్తయింది. మార్గదర్శకాలు వస్తే దీనిపై స్పష్టత రావడానికి అవకాశం ఉంది.
–శ్రీనివాస్‌రావు, జిల్లా సహకార శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment