ఎల్లారెడ్డి: పట్టణంలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడికి జీవితఖైదు విధిస్తు జిల్లా న్యాయమూర్తి వీఆర్‌ఆర్ వరప్రసాద్ తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ సింధూశర్మ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. ఎల్లారెడ్డిలో ఒంటరిగా నివాసముండే శేర్ల సుజాత (55)ను గంగుల శ్రీనివాస్ అలియాస్ డీజే శ్రీను 2022 డిసెంబర్ 10న హత్య చేసి, ఆమె మెడలో ఉన్న రెండు తులాల పుస్తెలతాడు, తులం బంగారు గుండ్లను ఎత్తుకెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.20వేల జరిమానాను జడ్జి విధించినట్లు ఎస్పీ తెలిపారు.
చీటింగ్ కేసులో ఇద్దరికి 15నెలల జైలు శిక్ష
బోధన్‌టౌన్(బోధన్): పట్టణంలోని ఆచన్‌పల్లి శివారులోగల భూమిని అమ్ముతామని డబ్బులు తీసుకొని మరొకరికి భూమిని విక్రయించి చీటింగ్ చేసిన కేసులో ఇద్దరికి 15నెలల జైలు శిక్ష పడింది. పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని ఆచన్‌పల్లి శివారులో భూమిని అమ్ముతామని ఫిర్యాదుదారుని వద్ద ఆవుల జగన్‌మోహన్‌రావ్, ఆవుల జీవన్ బాబు అనే ఇద్దరి వ్యక్తులు రూ. 7లక్షలు తీసుకున్నారు. మిగితా డబ్బులు ఇచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి బాండ్ పేపర్ రాశారు. కానీ కొన్ని రోజుల తర్వాత మరొకరికి భూమిని విక్రయించారని, 2013లో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టులో కేసు నడువగా, శుక్రవారం ఆవుల జగన్‌మోహన్‌రావ్, ఆవుల జీవన్‌బాబుకు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ పూజిత 15 నెలల జైలు శిక్ష, రూ. 2వేల జరిమానా విధిస్తు తీర్పును వెల్లడించారు.
డ్రంకెన్‌డ్రైవ్ కేసులో 3రోజుల జైలు
ఖలీల్‌వాడి: డ్రంకెన్‌డ్రైవ్ కేసులో ఒకరికి మూడు రోజుల జైలు శిక్ష పడ్డట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన 12మందికి కౌన్సెలింగ్ నిర్వహించగా, అనంతరం సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చామన్నారు. వారిలో 11 మందికి రూ. 15,500 జరిమానా విధించగా, చంద్రశేఖర్ కాలనీకి చెందిన షేక్ అబ్బాస్‌కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment