మిమిక్రీకి వన్నె తెస్తూ..
అచ్చం అలాగే అనుకరిస్తూ..
మోర్తాడ్/ఆర్మూర్/నిజామాబాద్ రూరల్: వారు పక్షిలా, జంతువులలాగా అరువగలరు.. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లా, సినిమా నటుల్లా, ప్రముఖులలాగా మాట్లాడగలరు.. ప్రకృతి పరవశింపజేసే ఆహ్లాదకరమైన వాతావరణంను సైతం అనుకరించి తమ స్వరంతో అందరిని అబ్బురపరిచే ధ్వని అనుకరణ వారి సొంతం. వారే మిమిక్రీ ఆర్టిస్టులు. అలా మిమిక్రీకి పర్యాయపదంగా నిలిచిన నేరెళ్ల వేణుమాధవ్ జయంతిని పురస్కరించుకుని నేడు మిమిక్రీ డేను జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా జిల్లా లోని మిమిక్రీ ఆర్టిస్టులపై సాక్షి ప్రత్యేక కథనం..
గురుశిష్యుల ప్రతిభ..
తమ ప్రదర్శనలతో ఎంతో మందిని సంతోషంతో గెంతులు వేసేలా చేస్తున్న మిమిక్రీ ఆర్టిస్టులు జిల్లాలో కొద్ది మందే ఉన్నారు. వారిలో ప్రముఖులు నిజామాబాద్‌లో స్థిరపడిన ఆర్మూర్‌కు చెందిన వేదాంతం రంగనాథ్. మిమిక్రీ ఆర్టిస్టుగానే కాకుండా మాట్లాడే బొమ్మ(వెంట్రిలాక్విజం)తో వినోదం పంచుతూ ఎన్నో ప్రదర్శనలు ఇవ్వడమే కాకుండా తన కళతో ఉత్సాహవంతులైన వారికి శిక్షణ ఇస్తున్నారు. మిమిక్రీ కళాకారునిగానే కాకుండా హిప్నాటిజంలోను రాణిస్తూ రంగనాథ్ తన శిష్యులైన బోండ్ల ఆనంద్‌తోను ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. తన గురువుతో కలిసి ఆనంద్ ఇప్పటి వరకు సుమారు ఐదు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. రెండు దశాబ్దాలకు పైగా ధ్వని అనుకరణతో వీక్షకుల మన్ననలు పొందుతున్న బోండ్ల ఆనంద్ పలు బిరుదులను సైతం సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర, జిల్లా నాయకులు, అధికారుల చేతుల మీదుగా సన్మానాలు అందుకున్నారు.
అలాగే డిచ్‌పల్లిలో స్థిరపడిన కాగజ్‌నగర్‌కు చెందిన వాసా రాబర్ట్ పేయింటింగ్‌తోపాటు మిమిక్రీ కళలోను రాణిస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి తన కళను వినియోగిస్తున్నారు. ఇందల్వాయి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన నడుకుల శంకర్ మిమిక్రీ శంకర్‌గా పేరుపొంది కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చారు. ప్రధానంగా విద్యార్థులలో జ్ఞాపకశక్తి ఏకాగ్రత పెంపొందించేలా పాఠశాల, కళాశాలలో వందల సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించారు. చిన్నతనంలోనే జ్ఞాన వాగ్దేవి విద్యాలయం నుంచి ప్రదర్శలను ప్రారంభించిన ఇందల్వాయికి చెందిన కందాళై దీక్షిత్ తన స్వరంతో అందరిని మాయ చేస్తున్నాడు. ఇప్పటి వరకు 500లకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. వేల్పూర్ మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన సౌడ రవి వృత్తి రీత్యా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు. చిన్నప్పటి నుంచి ధ్వని అనుకరణపై ఉన్న మక్కువతో మిమిక్రీ కళాకారుడిగా రాణిస్తున్నాడు. వీరంతా ధ్వని అనుకరణను ప్రదర్శిస్తూ పలు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటున్నారు. మిమిక్రీ పితామహుడు, పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ స్పూర్తితో తమ కళలో రాణిస్తున్నామని చెబుతున్నారు. తమకు అవకాశం ఉన్న ప్రతి చోట స్వరంతో మాయ చేసే కళాప్రదర్శనలను కొనసాగిస్తామని వారు వెల్లడించారు.
ఆకట్టుకుంటున్న జిల్లా ఆర్టిస్టులు
నేడు అంతర్జాతీయ మిమిక్రీ దినోత్సవం
64 కళల్లో ఒకటి..
ధ్వని అనుకరణ 64 కళల్లో ఒకటి. ఈ కళ పూర్వ కాలం నుంచే ఉంది. రామాయణం, మహాభారతాల్లోను ధ్వని అనుకరణతో పక్కదారి పట్టించే ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ధ్వని అనుకరణ ఎవరైనా చెయ్యవచ్చు అందుకు సాధన ఎంతో అవసరం. స్వరం మార్చడం అనేది అంత సులభమైనది కాదు. ఎంతో కఠోర శ్రమతో అలవాటు చేసుకుంది.
– వేదాంతం రంగనాథ్, మిమిక్రీ ఆర్టిస్టు
మరింత రాణించాలని..
మిమిక్రీ కళను నమ్ముకొన్న నన్ను ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటా. నా తల్లిదండ్రులు, గురువు, మెజీషియన్ రంగనాథ్, భారత్ గ్యాస్ మేనేజర్ సుమన్‌ల ప్రోత్సాహంతో మిమిక్రీ చేస్తున్నాను. ఈ కళను మరింత మెరుగు పర్చుకొని ఆర్మూర్‌వాసిగా రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలనే సంకల్పంతో కష్టపడుతున్నాను.
– బోండ్ల ఆనంద్, మిమిక్రీ కళాకారుడు, ఆర్మూర్ పట్టణం
Comments
Please login to add a commentAdd a comment