అదృశ్యమైన వ్యక్తి శవమై తేలాడు
కమ్మర్‌పల్లి: మండల కేంద్రంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ వ్యక్తి శుక్రవారం శవమై తేలాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. దోండి మోహన్(45) అనే వ్యక్తి కొంతకాలంగా కమ్మర్‌పల్లిలో పూల వ్యాపారం చేసుకుంటూ సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్నాడు. భార్య గంగామణితో పాటు, పిల్లలు ఉన్నారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మోహన్ తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో భార్య గంగామణి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మిస్సింగ్ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం సాయంత్రం ఉప్లూర్ రోడ్‌లో ఉన్న ఎస్సారెస్పీ వరద కాలువలో ఓ శవం తేలియాడుతూ స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి, మృతదేహాన్ని దొండి గంగామోహన్‌గా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఆ బాధతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) గ్రామ సమీపంలోని పాముల వాగు వంతెన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన వడ్ల కృష్ణమూర్తి తన బైక్‌పై లింగంపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా పాములవాగు వంతెన మూల మలుపు వద్ద బైక్ అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కృష్ణమూర్తి చేయి విరగడంతోపాటు తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 అంబులెన్సులో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
గంజాయి పట్టివేత
సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోట్ గిర్ని చౌరస్తా వద్ద గురువారం వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురి వద్ద గంజాయి లభించినట్లు డిచ్‌పల్లి సీఐ మల్లేష్ తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు. భీంగల్ మండలం బడాభీంగల్ గ్రామానికి చెందిన ఒరగంటి శ్రీనివాస్, చిత్తరి అరుణ్, ఓ బాలుడు ముగ్గురు కలిసి ఒకే బైక్‌పై వస్తుండగా, వారిని ఆపి సోదా చేయగా వారి వద్ద 60 గ్రాముల గంజాయి లభించినట్లు తెలిపారు. వారిని విచారించగా భీంగల్ మండలం మెండోరా గ్రామానికి చెందిన కనక యశ్వంత్, బోదాసు నరేష్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. అధిక ధరకు అమ్ముకొని సొమ్ము చేసుకోవడానికి పెద్దవాల్గోట్ గ్రామంలో వారి వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు తెలిపారన్నారు. దీంతో పెద్దవాల్గోట్ గ్రామానికి వెళ్లి యశ్వంత్, నరేష్‌ను పట్టుకొని, వారి వద్ద నుంచి 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు ఆయన తెలిపారు. ఎస్సై ఎల్ రామ్, కానిస్టేబుళ్లు ఉన్నారు.
సిమెంట్ లారీ బోల్తా
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం సిమెంటు లారీ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు వెళ్తున్న సిమెంటు లారీ అదుపుతప్పి నవీపేట రైల్వే గేట్ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్ ఇసుఫ్, క్లీనర్ సాజిద్‌లకు ఎలాంటి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment