రైతు భరోసా ఆలస్యమేనా...? | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా ఆలస్యమేనా...?

Published Mon, Feb 3 2025 1:52 AM | Last Updated on Mon, Feb 3 2025 1:52 AM

రైతు

రైతు భరోసా ఆలస్యమేనా...?

ఎన్నికల కోడ్‌ బ్రేక్‌

వేయకపోయినా...

ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమలుతో రైతు భరోసాకు బ్రేక్‌ పడుతుందని ఊహాగాలు వినిపించాయి. రైతు భరోసా పథకం కోడ్‌ కూయక ముందే అమలు చేయడం, ఈ పథకం పాతదే కావడంతో కోడ్‌ ఎలాంటి అడ్డంకు సృష్టించదని అధికార యంత్రాంగం వెల్లడిస్తోంది. కోడ్‌ వర్తించకపోవడంతో రైతులకు ఊరట కలిగిస్తున్నా నిధుల విడుదల విషయంలో మాత్రం జాప్యం తీవ్ర నిరాశను మిగులుస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఎంపిక చేసిన మండలానికి ఒక

గ్రామంలోని రైతులకు జమైన సొమ్ము

మిగిలిన గ్రామాల్లోని రైతుల

ఎదురు చూపులు

ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరుతున్న లబ్ధిదారులు

మోర్తాడ్‌(బాల్కొండ): యాసంగి సీజన్‌ పెట్టుబడి సాయం సొమ్ము జమ చేయడంలో ఇంకా కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 26 నుంచి రైతుల ఖాతాల్లో రైతు భరోసా సొమ్ము జమ కావాల్సి ఉంది. గణతంత్ర దినోత్సవం రోజున లాంఛనంగా కార్యక్రమం ప్రారంభించారు. ఇందులో భాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాలలోని రైతులకే వంద శాతం రైతు భరోసా సొమ్మును జమ చేశారు. మిగిలిన గ్రామాల్లోని రైతులకు మాత్రం ఇంకా సొమ్ము జమ కాలేదు.

గతంలో తొలి విడతలో ఒక ఎకరం విస్తీర్ణంలోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం జమ చేసేవారు. ఇలా విడతల వారీగా వారం నుంచి పదిహేను రోజుల పాటు రైతుల ఖాతాల్లో వారికి ఉన్న భూమి విస్తీర్ణం లెక్క ప్రకారం సొమ్ము జమ అయ్యేది. ఈసారి అలాకాకుండా తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లోని మొత్తం మంది రైతులకు రైతు భరోసా సొమ్మును జమ చేశారు. రైతులకు ఉన్న భూముల విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఎంత ఉన్నా సాగుకు యోగ్యమైన భూమి ఉంటే చాలు పెట్టుబడి సొమ్మును జమ చేశారు. అలా 31 గ్రామాలలోని 15,937 మంది రైతులకు రూ.18 కోట్ల, 52 లక్షల, 43 వేల, 385 విడుదలైంది.

సాగుకు యోగ్యం కాని భూముల

తొలగింపు...

గత ప్రభుత్వం గుట్టలు, రియల్‌ ఏస్టేట్‌ వెంచర్లు, పరిశ్రమలు ఇలా ఎన్నో రకాల సాగుకు యోగ్యం కాని భూములకు పెట్టుబడి సాయం అందించి రూ.కోట్లాది సొమ్మును పక్కదారి పట్టించిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించింది. రైతు భరోసా కింద గతంలో కంటే ఒక్కో ఎకరానికి రూ.వెయ్యి పెంచి సాగుకు యోగ్యమైన భూములకే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను నమోదు చేయగా 10 వేల ఎకరాలకు పైగా భూమిని గుర్తించారు. ఈ భూమిని మినహాయించి మిగిలిన మొత్తం భూమికి రైతు భరోసా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 2.90 లక్షల మంది రైతులకు వారి వద్ద ఉన్న సాగుకు యోగ్యమైన భూమికి పెట్టుబడి సాయం అందించనున్నారు. గతంలో కంటే కొంత భూమి విస్తీర్ణం తగ్గినా సాయం సొమ్ము పెరగడంతో ఇంకా ఎక్కువ నిధులే జిల్లాకు విడుదల అయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు ఎంత విస్తీర్ణం భూమికి, ఎంత మంది లబ్ధిదారులు అనే లెక్కలు తీస్తున్నారు. ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయడం వల్ల లబ్ధిదారుల ఖాతాల్లో పెట్టుబడి సాయం సొమ్ము జమ కావడంలో కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

ఇప్పటికే ఆలస్యమైంది

రైతు భరోసా సొమ్ము విడుదల చేసే విషయంలో ఇప్పటికే ఆలస్యమైంది. యాసంగి పంటల సాగు ఎప్పుడో మొదలైంది. ప్రభుత్వం పెట్టుబడి సాయం తొందరగా రైతులకు విడుదల చేయాలి. పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేయాల్సి వస్తోంది. జాప్యం చేయకుండా నిధులు కేటాయించాలి. – మాదాం చిన్న నర్సయ్య, రైతు, తొర్తి

అర్హులైన అందరికీ సొమ్ము జమ

అర్హులైన రైతులందరికీ రైతు భరోసా సొమ్ము జమ అవుతుంది. తొలి విడతలో ఎంపిక చేసిన గ్రామాల్లోని అందరు రైతులకు సొమ్ము జమ చేశారు. కొన్ని రోజుల్లోనే జిల్లాలోని అన్ని గ్రామాల రైతులకు పెట్టుబడి సాయం విడుదల చేస్తారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అవుతుంది.

– వాజిద్‌ హుస్సేన్‌, జిల్లా వ్యవసాయాధికారి

వ్యవసాయ శాఖకు సమాచారం కరువు..

రైతు భరోసా నిధుల విడుదల విషయంలో ప్ర భుత్వం నుంచి వ్యవసాయ శాఖకు స్పష్టత లేకపోవడం గమనార్హం. కేవలం లాంఛనంగా కార్యక్రమం ప్రారంభించిన గ్రామాలు, అక్కడి రైతుల సంఖ్య, వారికి విడుదలైన మొత్తం సొమ్ము వివరాలే వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయి. మిగిలిన గ్రామాలలోని రైతులకు రైతు భరోసా సొమ్ము విడుదలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. ప్రభుత్వం రంగారెడ్డి ట్రెజరీ ద్వారానే రైతు భరోసా సొమ్మును విడుదల చేయనుండటంతోనే సమాచార లోపం ఏర్పడినట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
రైతు భరోసా ఆలస్యమేనా...? 1
1/1

రైతు భరోసా ఆలస్యమేనా...?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement