సీరియస్‌గా తీసుకోండి
● ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం..
స్థానిక సంస్థల్లో ప్రభావం
● ఏడుగురు మంత్రులకు 42
నియోజకవర్గాల బాధ్యతలు
● పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్
కరీంనగర్ కార్పొరేషన్: ‘ఎమ్మెల్సీ ఎన్నిక మనకు ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికల్లో విజయంతోనే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల విజయానికి బాటలు పడతాయి. అలసత్వం వద్దు...సీరియస్‌గా తీసుకోండి. ఆరు నియోజకవర్గాలకో మంత్రి ఇన్‌చార్జిగా ఉంటారు. ఓటింగ్‌కు అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జిలదే బాధ్యత’ అంటూ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ పార్టీ శ్రేణులు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వి నరేందర్‌రెడ్డి నామినేషన్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో ఓ హోటల్‌లో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ ఎన్నిక ఫలితం ప్రభావం చూపుతుందన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను ఏడుగురు మంత్రులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. మరో పదిహేను రోజులే గడువు ఉన్నందున మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేయాలని సూచించారు. పట్టభద్రుల అభ్యర్థి వి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ తనకు ఎమ్మెల్సీ టి జీవన్‌రెడ్డి రోల్ మోడల్ అన్నారు. అన్ని రకాల సర్వే చేసి, తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారన్నారు. నరేందర్‌రెడ్డి నామినేషన్ సందర్భంగా నగరంలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ర్యాలీలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల నుంచి నేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment