నీటి కోసం ఎదురుచూస్తున్న కృష్ణా డెల్టా రైతులు
రైతుకు సార్వా పంట కంటే దాళ్వా పంటలోనే దిగుబడి, ఆదాయం ఉంటాయి. సార్వా పంట తుఫాను, చీడ పురుగుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో బంటుమిల్లి కాలువ శివారు భూములన్నీ అపరాలు పండవు. దాళ్వా ఒకటే రెండో పంటగా సాగు చేయాల్సి ఉంది. రైతు బాధను అర్థం చేసుకుని రెండో పంటకు నీరు ఇస్తే బాగుంటుంది.
వెంట్రపాటి సురేష్,
పెందుర్రు, బంటుమిల్లి మండలం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో రైతులు దాళ్వా సాగుపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది వరి నాట్ల ప్రారంభ సమయంలో చివరి ఆయకట్టుకు నీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారు. ఆగష్టు, సెప్టెంబరు నెలలో అధిక వర్షాలతో రైతన్నలకు నష్టం వాటిల్లింది. బుడమేరు పరివాహక ప్రాంతంలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. దీనికితోడు వరి పంటను తెగుళ్లు అశించాయి. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది వరి దిగుబడులు సైతం తగ్గాయని వ్యవసాయ రంగ నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఖరీఫ్‌లో సాధారణ సాగు విస్తీర్ణం 1,65,789 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 1,51,718 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు. అధిక వర్షాలు, బుడమేరు వరదల కారణంగా 24,162 హెక్టార్లలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 161.29 టీఎంసీలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 295.99 టీఎంసీలు పులిచింతల ప్రాజెక్టు లో 43.26 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం పట్టిసీమ నీటిని కూడా తీసుకొంటున్నారు. ఈనేపథ్యంలో ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉండటంతో డెల్టాలోని బంటుమల్లి, కృత్తివెన్ను, పెడన , మచిలీపట్నం, గుడూరు మండలాల పరిధిలో సుమారు 30 వేల హెక్టార్లకు దాళ్వాకు నీరు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ఈ భూములన్నీ సముద్రతీర సాల్ట్ భూములు చౌడు భూములుగా ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నాయి. కంకిపాడు, పెనమలూరు మండలాల్లో రెండవ పంటగా వరి 10 వేల హెక్టార్లలో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టుల్లో ఇంత కన్నా తక్కువ నీరు ఉన్నా రెండవ పంటకు నీరు ఇచ్చారు. కరువు వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఆయకట్టుకు నీరు ఇచ్చి ఆదుకున్న పరిస్థితులను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఏడాది తప్పక కుండా నీరు ఇవ్వాలని, లేకపోతే ఒక్క పంటకే పరిమితమయ్యే పరిస్థతి వస్తుందని అందోళన చెందుతున్నారు. ఈ మండలాల్లో వరి తప్ప మిగతా పంటలు పండే పరిస్థితి లేదని చెబుతున్నారు. త్వరలో జరిగే నీటి పారుదల సలహా మండలి సమావేశంలో నిర్ణయం తీనుకొంటారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.
సాగర్ మేజర్, మైనర్ కాలువలకు మరమ్మతులు లేక నీరు పారే పరిస్థితి లేదు. సాగునీరు సరఫరా చేసే ముందే కాలువలు బాగు చేయాలి. చిట్టడవిని తలపిస్తున్న మేజర్లను వెంటనే బాగుచేయకపోతే సాగర్ జలాలు వృథాగా పోతాయి.
కె.నాగిరెడ్డి,
అక్కపాెం, తిరువూరు మండలం
ఎన్‌ఎస్‌పీ పరిధిలో
కొన్ని రోజులుగా ఆందోళన
చేస్తున్న వైనం
నిండు కుండలను తలపిస్తున్న
జలాశయాలు
రబీలో 85 వేల ఎకరాల్లో
వరిపంట సాగవుతుందని అంచనా
రెండో పంటకు సాగునీరు ఇవ్వకపోతే మా భూములన్నీ బీడు వారిపోతాయి. సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో మా ప్రాంతంలో నేల స్వభావం అధికంగా లవణ సాంద్రత కలిగి ఉంటుంది. దాళ్వాకు నీరు ఇవ్వకపోతే దాని ప్రభావం తరువాత వచ్చే సార్వాపై తీవ్రంగా ఉంటుంది.
పాశం శ్రీనివాసరరావు (రాము),
నీలిపూడి, కృత్తివెన్ను మండలం
ఎన్‌ఎస్‌పీ ఎడమ కాలువ పరిధిలో ఆరుతడి పంటలకు డిసెంబరు 1నుంచి నీరు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నాగార్జున ఎడమ కాలువ పరిధిలో తిరువూరు, నూజివీడు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలో 2.52 లక్షల ఆయకట్టు ఉంది. ప్రధానంగా మిరపతో పాటు ఆరుతడి పంటలకు సంబంధించి రెండు నెలలకు సరిపడా 15 టీఎంసీల నీరు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారు. తరువాత అవసరాన్ని బట్టి నీటి విడుదల కోసం ప్రయత్నిస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అయితే మైలవరం, నందిగామ వంటి ప్రాంతాల్లో చివరి ఆయకట్టుకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాలువల్లో పూడిక, తూటికాడ, మరమ్మతులు వంటి పనులు చేపట్టి, నీరు కాలువల గుండా ఇబ్బంది లేకుండా పారేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment