ఇబ్రహీంపట్నం: ‘పై అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నా. నాకు చావే శరణ్యం’ అంటూ ఓ వీఆర్వో సూసైడ్ లెటర్ రాసి, అదృశ్యమవడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మండలం, రాఘవాపురం గ్రామానికి చెందిన పెసరమిల్లి అశోక్, కంచికచర్ల మండలం పేరికలపాడు గ్రామ వీఆర్వోగా పనిచేశారు. గత నెల 14న బదిలీపై 4వ సచివాలయానికి వచ్చారు. ఈనెల సామాజిక పింఛన్‌ల పంపిణీలో భాగంగా ఓ వృద్ధురాలికి పింఛన్ ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకున్నట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తహసీల్దార్ జోక్యంతో పింఛన్ సొమ్మును ఆమెకు అందజేశాడు. ఈ క్రమంలో అశోక్ సోమవారం రాత్రి తన చావుకు మండల తహసీల్దార్ వై.వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ వరప్రసాద్ కారణం అంటూ రాసిన ఓ సూసైడ్ లెటర్ రెవెన్యూ ఉద్యోగుల గ్రూప్‌లో పోస్టు చేశారు. మంగళవారం ఉదయం ఇతర వాట్సాప్ గ్రూపుల్లో ఆలేఖ ప్రత్యక్షమవడంతో కలకలం రేగింది. రెవెన్యూ అధికారులు అశోక్‌ను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ‘నాకు హార్ట్ సర్జరీ జరిగింది. 75 పీజీఆర్‌ఎస్ అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని తహసీల్దార్, ఆర్‌ఐ నాపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ మధ్య ఫిట్స్ వచ్చి చికిత్స పొందాను. నన్ను కలెక్టర్ కార్యాలయంలో సరెండర్ చేస్తున్నట్లు తహసీల్దార్ చెప్పారు. వీరి ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. నా చావుకు తహసీల్దార్, ఆర్‌ఐ కారణం’ అని సూసైడ్ లెటర్‌లో రాశాడు. ఈ విషయంపై తహసీల్దార్ వెంకటేశ్వర్లుని వివరణ కోరగా.. అశోక్ విధి నిర్వహణలో అలసత్వం వహించాడని, ఆయన వల్ల కార్యాలయ సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోందని తెలిపారు. ఈనెల 5న అశోక్‌ను కలెక్టర్ కార్యాలయానికి సరెండర్ చేశానని, ప్రస్తుతం ఆయనతో తమ కార్యాలయానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయినా అశోక్ స్వగ్రామానికి సిబ్బందిని పంపించి వాకబు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
● సూసైడ్ లెటర్ రాసిన వీఆర్వో
● ఉద్యోగుల వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు
● ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment