గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజాప్రయోజనాలతో ముడిపడిన ఫైల్స్ త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంతో కలిసి కలెక్టరేట్ వివిధ విభాగాల సూపరింటెండెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడంలో అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన ఫైళ్లను సత్వరం పరిష్కరించాలని.. అలసత్వానికి తావులేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. వీటి పరిష్కారంలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు. వివిధ ప్రగతి సూచికల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములవుతూనే మరోవైపు రోజువారీ అధికారిక విధుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment