దుర్గమ్మ నిత్యాన్నదానానికి విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విశాఖపట్నంకు చెందిన భక్తులు మంగళవారం రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. విశాఖ పట్నంకు చెందిన ఉప్పలపాటి నరేంద్రనాథ్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ. 1,01,116 విరాళాన్ని అందించింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదతో అమ్మవారి దర్శనం కల్పించగా, ఆలయ డీఈవో రత్నరాజు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం కావాలి
కంకిపాడు: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని సివిల్‌సప్లయీస్ ఎండీ మనజీర్ జిలానీ సము ఆదేశించారు. కంకిపాడు, పునాదిపాడు, దావులూరు ప్రాంతాల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు పరిశీలించారు. కాటాలు వేసి లారీల కోసం ఎదురుచూస్తున్న రైతులతో మాట్లాడారు. స్థానిక రైతులకు అవసరమైన లారీలు సమకూర్చి వేగంగా మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కోత కోసిన ధాన్యం రోడ్లపై నిల్వ ఉండకుండా చూడాలని, రైతులకు అవసరమైన సంచులు, రవాణా వాహనాలను నిబంధనల మేరకు సమకూర్చాలన్నారు. పర్యటనలో ఆర్‌డీఓ బీఎస్ హెలా షారోన్, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ డి. సృజన, తహసీల్దార్ వి.భావనారాయణ, ఏఓ పీఎం కిరణ్ పాల్గొన్నారు. కంకిపాడు, పునాదిపాడు గ్రామాల్లో వరి కోతలు, ధాన్యం రవాణా ప్రక్రియను డీఎస్‌ఓ పార్వతి పరిశీలించారు.
ఉత్సాహంగా
బాక్సింగ్ ఎంపిక పోటీలు
కేతనకొండ(ఇబ్రహీంపట్నం): కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ బాక్సింగ్ ఎంపిక పోటీలు కేతనకొండ ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించారు. పోటీలను కళాశాల కార్యదర్శి ఎం.మహేంద్రనాథ్, ప్రిన్సిపాల్ కె.రామకృష్ణయ్య, యూనివర్సిటీ స్పోర్ట్స్ కార్యదర్శి శ్యాంకుమార్ ప్రారంభించారు. వివిధ కళాశాలలకు చెందిన 25మంది విద్యార్థులు పోటీల్లో తలపడ్డారు. తుదిపోరులో పోటీపడి ప్రతిభ చాటిన ఐదుగురు యువకులు, నలుగురు యువతులను సౌత్‌జోన్ పోటీలకు ఎంపిక చేశారు. ఆర్కే కళాశాలకు చెందిన కోమల అనే విద్యార్థిని కూడా ఎంపికై నట్లు కళాశాల కార్యదర్శి మహేంద్రనాథ్ తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ సాయిరామ్, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు ఎంపికై న వారిని అభినందించారు.
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా శిల్పారామం
చైర్‌పర్సన్‌గా బాధ్యతలను
స్వీకరించిన మంజులారెడ్డి
భవానీపురం(విజయవాడపశ్చిమ): భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే శిల్పారామం కేంద్రాలను మరింత అభివృద్ధి చేసే విధంగా తీర్చిదిద్దుతానని శిల్పారామం సొసైటీ చైర్‌పర్సన్‌గా నియమితులైన మాచర్ల పట్టణానికి చెందిన మంజులారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని శిల్పారామం ఆర్ట్స్, క్రాఫ్ట్స్, కల్చరల్ సొసైటీ కార్యాలయంలో ఆమె మంగళవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా శిల్పారామం సీఈఓ స్వామినాయుడు, మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి తదితరులు ఆమెను అభినందించారు. అనంతరం మంజులారెడ్డి మాట్లాడుతూ శిల్పారామం సొసైటీ కీర్తి ప్రతిష్టలను మరింత ఇనుమడింపచేసేలా కృషి చేస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment