ప్రయాణికులను ఏమార్చి చోరీలు
విజయవాడస్పోర్ట్స్: రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులను ఏమార్చి వారి జేబుల్లో నగదును దొంగలిస్తున్న ముఠాను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌లోని సీసీఎస్ స్టేషన్ వద్ద క్రైం ఏసీపీ వెంకటేశ్వర్లు బుధవారం వెల్లడించారు. విశాఖపట్నం, గోపాలపట్నంకు చెందిన బుర్రి సురేష్, అరిటాకుల తారకేశ్వరరావు, కై లాసపురానికి చెందిన కంబాల శ్రీను, కొబ్బరితోటకు చెందిన బుడుమూరి రాజు స్నేహితులని, గతంలో వీరు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడి జైలు జీవితం అనుభవించారని చెప్పారు. రద్దీ ప్రదేశాలలో తిరుగుతూ అమాయక ప్రజల సొమ్మును ఈ ముఠా దొంగిలిస్తోందన్నారు. ఈ నలుగురు రద్దీ ప్రదేశాలను ఎంచుకుని అక్కడ ఎవరి వద్ద డబ్బులు ఎక్కువ ఉన్నాయో గ్రహించి, అక్కడి ప్రజల జేబుల్లో నగదును ఈ ముఠాలోని ఒక వ్యక్తి దొంగిలించే సమయంలో మిగిలిన ముగ్గురు వ్యక్తులు తోపులాట జరుగుతున్నట్లు, రద్దీ ఎక్కువగా ఉన్నట్లు అక్కడ వాతావరణాన్ని సృష్టిస్తారని తెలిపారు. ఈ తరహా చోరీలకు పాల్పడటంతో ఈ ముఠా ఆరితేరిందన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ ముఠా చోరీలకు పాల్పడుతుందన్నారు. ఈ నెల ఆరో తేదీన చల్లపల్లికి చెందిన ఓ వ్యక్తిని ఇదే మాదిరిగా ఏమార్చి అతని వద్ద ఉన్న డబ్బులు కాజేసినట్లు చెప్పారు. ఆసుపత్రిలో ఉన్న తన బావమరిది చికిత్స నిమిత్తం తీసుకొచ్చిన నగదును పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఈ ముఠా దొంగిలించిందన్నారు. కృష్ణలంక పోలీసులకు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము దర్యాప్తు చేశామన్నారు. పక్కా సమాచారంతో బస్టాండ్ సమీపంలోని పద్మావతి ఘాట్ వద్ద బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని వారి వద్ద నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. సీసీఎస్ సీఐలు అబ్దుల్‌సల్లా, రామ్‌కుమార్ పాల్గొన్నారు.
సినీ ఫక్కీలో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
Comments
Please login to add a commentAdd a comment