ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు
పెనమలూరు: పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా పురస్కార అవార్డు పొందారు. భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయ్‌పూలే పేరున ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు గుంటూరులో ఇటీవల అందజేశారు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు ఎం.సుగుణవల్లి, జి.స్వరూప, జి.సువర్చల ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘసేవలు అందించి ప్రతిభ చూపటంతో అవార్డు పొందారు. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వీరిని ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మునిసిపల్ కార్మికుల ధర్నా
పెనమలూరు: తడి, పొడి చెత్త తరలించే వ్యాన్ డ్రైవర్లకు గత మూడు నెలల జీతాలు ఇవ్వాలని కార్మికులు పోరంకిలోని తాడిగడప మునిసిపాలిటీ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా మునిసిపల్ కార్మికుల సంఘ రాష్ట్ర కోశాధికారి జ్యోతిబసు మాట్లాడుతూ గత మూడు నెలలుగా కార్మికులకు ప్రభుత్వం జీతాలు చెల్లించక పోవటం దారుణమన్నారు. మునిసిపాలిటీలో పని చేస్తున్న కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య దోరణి చూపటం సరైందికాదన్నారు. మునిసిపాలిటీలో పని చేస్తున్న ఇతర కార్మికుల సమస్యలు కూడా తక్షణం పరిష్కరించాలని లేని పక్షంలో ఫిబ్రవరి నెల నుంచి సమ్మె చేస్తామని తెలిపారు. అనంతరం కార్మికులు కమిషనర్ భవానీప్రసాద్‌ను కలిసి జీతాలు చెల్లించాలని విన్నవించారు. నేతలు ఉప్పాడ త్రిమూర్తి, షేక్.కాశిం, షేక్.మస్తాన్‌వలి, వై.సరళ, మధిర ఏడుకొండలు, దుర్గారావు, వెంకటరెడ్డి, పలువురు పాల్గొన్నారు.
కూచిపూడి పీఠంకు
‘న్యాక్’ అభినందన
కూచిపూడి(మొవ్వ): కూచిపూడి శ్రీ సిద్ధేంద్ర కళాపీఠం విద్యార్థులను నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్(న్యాక్) బృందం అభినందించినట్లు అదనపు బాధ్యతలతో ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్న డాక్టర్ ముసుగు శ్రీనివాసరావు వెల్లడించారు. ఐదుగురు సభ్యులతో కూడిన న్యాక్ బృందం తెలంగాణ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం క్యాంపస్‌ను పరిశీలించింది. ఈ సందర్భంగా కూచిపూడి శ్రీసిద్దేంద్రయోగి నాట్య కళాపీఠం డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు చేస్తున్న విద్యార్థినులు ఉప ప్రధానాచార్యులు డాక్టర్ చింతా రవి బాలకృష్ణ నేతృత్వంలో తరంగం నృత్యంతో పాటు పలు నృత్యాంశాలను ప్రదర్శించారని తెలిపారు. అలాగే కూచిపూడి నాట్య కళాపీఠంలో జరుగుతున్న వివిధ కోర్సుల నాట్య శిక్షణపై ఎంపీఏ విద్యార్థులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారన్నారు. వీటిని చూసిన న్యాక్ సభ్యులు కళాపీఠాన్ని అభినందించినట్లు చెప్పారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వెలిగండ్ల నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు పర్యవేక్షణలో న్యాక్ బృందం మూడు రోజులపాటు కొనసాగించిన ఈ పరిశీలనలు బుధవారంతో ముగిశాయని వెల్లడించారు.
క్రీడాకారులకు సత్కారం
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అభినందించారు. 68వ అంతర్ జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్‌లో అండర్ 19 బాలికల విభాగంలో తిరుమలశెట్టి నాగ చంద్రిక, అండర్–14 బాలుర విభాగంలో పుప్పాల శ్రీరామ్ గోపాల్ తమ ప్రతిభను చూపించి ఆంధ్రప్రదేశ్ టీమ్‌కు ఎంపికయ్యా రు. వీరిని బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో కలెక్టర్ సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment