‘కొలికపూడి’ చెప్పేవన్నీ అబద్ధాలే
తిరువూరు: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలే ఆడుతున్నారని, గిరిజన మహిళపై దాడిచేసి అది తప్పుకాదని బుకాయిస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. బుధవారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఎ.కొండూరు మండలం గోపాలపురంలో ఈనెల 11న ఎమ్మెల్యే దాడిలో తీవ్రంగా గాయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వార్డు సభ్యురాలు, గిరిజన మహిళ అయిన భూక్యా చంటిని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్‌తో కలిసి బుధవారం పరామర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తిరువూరులో ఎమ్మెల్యే అరాచకంగా వ్యవహరిస్తున్నారని.. కొలికపూడికి మహిళలంటే గౌరవంలేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎమ్మెల్యే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై దాడులకు పాల్పడటం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం గర్హనీయమన్నారు. బాధిత కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. పోలీసులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి.
ఎమ్మెల్యేపై చర్యలెందుకు తీసుకోవట్లేదు?
ఇక ఎమ్మెల్యే కొలికపూడిపై టీడీపీ అధిష్టానం ఎందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదని దేవినేని అవినాష్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో పాటు ఈ దాడిలో పాల్గొన్న వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులే కొలికపూడిపై ఫిర్యాదు చేస్తున్నారంటే ఆయన అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తోందన్నారు. ఇక ఎమ్మెల్యే తన స్వీయ రక్షణ కోసమే గిరిజన మహిళ కుటుంబంపై అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆరోపించారు. మహిళలకు అండగా ఉంటామని చట్టసభల్లో మాట్లాడే సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తిరువూరు ఎమ్మెల్యే చర్యలకు ఏం సమాధానం చెబుతారని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ప్రశ్నించారు.
మాజీ మంత్రి మేరుగ నాగార్జున
Comments
Please login to add a commentAdd a comment