వక్ఫ్ భూములకు మోక్షం!
పెనమలూరు: కోట్ల రూపాయల విలువ చేసే వక్ఫ్ భూములకు ఎట్టకేలకు ఏక్ సాల్ (ఒక సంవత్సరం సాగుకు) లీజ్ వేలం నిర్వహించడానికి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని సంవత్సరాలుగా వక్ఫ్ భూములు ఓ బడా వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. అతను లీజు సొమ్ము చెల్లించడంలేదన్న ఆరోపణలు వచ్చాయి. పైగా వక్ఫ్ భూముల్లో సంక్రాంతి పండుగకు కూటమి నేతలు కోడి పందేల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావటంతో అధికార యంత్రాంగం స్పందించింది.
రూ.400 కోట్ల విలువైన భూమి
పెనమలూరు మండలం తాడిగడపలో ఆర్‌ఎస్ నంబర్లు 79,173లలో 30.04 ఎకరాలు, పెదపులిపాక గ్రామంలో ఆర్‌ఎస్ నంబర్ 87లో 12.82 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఈ భూములకు బహిరంగ మార్కెట్‌లో రూ.400 కోట్లకు పైగా ధర పలుకుతోంది. చాలా కాలంగా ఈ వక్ఫ్ భూములు బడా వ్యక్తి చేతుల్లో ఉన్నాయి. దీంతో ఏక్ సాల్ లీజు వేలం నిర్వహించలేదు. ఈ భూమిని బడా వ్యక్తి వద్ద నుంచి టీడీపీ నేతలు సబ్‌లీజు తీసుకొని పంటలు సాగు చేస్తున్నారు. లీజు సొమ్ము కొండపల్లి ఖాజీకి లేదా వక్ఫ్ బోర్డుకు చెల్లించడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. లీజుదారుడు, ఖాజీ, వక్ఫ్ అధికారులు కుమ్మక్కై వక్ఫ్ భూముల ఆదాయంతో పాటు ఆ భూములపై కన్నేశారని ముస్లిం మైనారిటీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అయినా ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు స్పందించలేదు.
ఈ నెల 31న లీజు వేలం
ఈ నెల 31వ తేదీన 42.86 ఎకరాల వక్ఫ్ భూములకు లీజు నిర్వహించడానికి తహసీల్దార్ ది ఇన్ స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్‌కు నోటీసు ఇచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో 31వ తేదీ ఉదయం 11 గంటలకు ముతావలి, తాడిగడప మునిసిపల్ కమిషనర్, రెవెన్యూ, వక్ఫ్ అధికారుల సమక్షంలో ఏక్ సాల్ లీజు వేలం జరుగుతుంది.
ఏక్ సాల్ లీజు వేలం జరుగుతుందా?
అత్యంత విలువైన వక్ఫ్ భూముల ఏక్ సాల్ లీజు సక్రమంగా నిర్వహిస్తారా లేదా అనే విషయం స్థానికుల్లో చర్చ జరుగుతోంది. పంటలు సమృద్ధిగా పండే ఈ భూములపై బడా వ్యక్తులు కన్నేయటంతో స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏక్ సాల్ లీజు సక్రమంగా జరిగితే మంచి ఆదాయం చేకూరే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఏక్‌సాల్ లీజు జరగక పోవటంతో అందరి దృష్టి వక్ఫ్ భూములపైనే ఉంది.
చాలా కాలానికి ఏక్‌సాల్ లీజ్ వేలానికి చర్యలు
కొన్నేళ్లుగా ఓ వ్యక్తి చేతుల్లో వక్ఫ్ భూములు
ఏళ్ల తరబడి లీజ్ సొమ్ము చెల్లించని వైనం
సబ్‌లీజుతో సాగు చేస్తున్న టీడీపీ నేతలు
కోడి పందేల బరితో..
సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందే లు నిర్వహించటానికి వక్ఫ్ భూమిలో బరి సిద్ధం చేశారు. టీడీపీ నేతలు సబ్ లీజు తీసుకోవటంతో చట్ట విరుద్ధంగా ఈ చర్యలకు దిగారు. ‘వక్ఫ్ భూముల్లో బరితెగింపు’ శీర్షికన ఈ నెల 12న ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం స్పందించింది. సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాసగౌడ్ ఈ వ్యవహారంపై పీజీఆర్‌ఎస్ (మీ కోసం)లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ వక్ఫ్ కూడా లీజు వ్యవహారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఏక్‌సాల్ లీజు నిర్వహించాలని పెనమలూరు తహసీల్దార్‌కు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment