చేనేత సమస్యలపై గళమెత్తుదాం
గన్నవరం: చేనేతల సమస్యలపై గళమెత్తేందుకు గుంటూరు జిల్లా మంగళగిరి కేంద్రంగా ఏప్రిల్ 27వ తేదీన చేనేత కార్మికుల ఆత్మగౌరవ సభ నిర్వహించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నిర్ణయించింది. ఈ మేరకు కృష్ణాజిల్లా గన్నవరంలో ఆదివారం ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు బండారు ఆనంద్‌ప్రసాద్ నేతృత్వంలో జరిగిన చేనేతల బహిరంగ సభ సన్నాహక సమావేశం జరిగింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఆప్కో చైర్‌పర్సన్ డాక్టర్ సజ్జా హేమలత, పలువురు ఫెడరేషన్, చేనేత సంఘాల నుంచి బహిరంగ సభ ఏర్పాట్లపై అభిప్రాయాలను సేకరించారు. అనంతరం ఆనంద్‌ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. చేనేతలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సరైనా ప్రాధాన్యం దక్కడం లేదన్నారు. రాజకీయంగా తమకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో చేనేతల సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో చేనేతల సమస్యల పరిష్కరానికి వీవర్స్ ఫెడరేషన్‌తో పాటు అన్ని సంఘాలను ఐక్యం చేస్తున్నట్లు తెలిపారు. అందరి సమన్వయంతో మంగళగిరిలో జరగనున్న బహిరంగ సభను విజయవంతం చేసి చేనేతల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధకృష్ణయ్య, ఆప్కో మాజీ చైర్మన్ గంజి చిరంజీవి, ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మహేష్, గౌరవాధ్యక్షుడు నక్కిన చినవెంకట్రాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు వనమాల శివరాంప్రసాద్, ప్రధాన కార్యదర్శి పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment