ఆకలి చావులపై ఆర్డీసీ దర్యాప్తు
● ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి
● గవర్నర్‌ను కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి
బృందం
భువనేశ్వర్: కంధమల్ జిల్లా దారింగిబాడి మండలం మండిపొంకొ గ్రామంలో ఆకలి చావుల సంఘటన కలకలం రేపుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఆహార భద్రత కింద బియ్యం రేషన్ నిలిపి వేశారు. దీంతో ఆకలికి తాళలేక పొట్ట నింపుకునేందుకు ఈ గ్రామంలో ప్రజలు ఎండలో ఆరబెట్టిన మామిడి బద్దలతో జావ చేసుకుని తాగారు. ఇది కాస్తా ప్రతికూలం కావడంతో ఇద్దరు మహిళలు ఏకంగా చనిపోయారు. మరో ఆరుగురు అనారోగ్యం బారిన పడి ఆస్పత్రిలో మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి ఇంత వరకు విషమంగా కొనసాగుతోంది. వీరి కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆర్డీసీ దర్యాప్తు
ఈ సంఘటనపై మంగళవారం న్యూ ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆర్డీసీ హోదా అధికారితో దర్యాప్తు జరిపించాలని ఆదేశించారు. దక్షిణ ప్రాంతపు రెవెన్యూ డివిజినల్ కమిషనరు రూపా రోషన్ సాహు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని పేర్కొన్నారు.
గవర్నర్ చొరవ కోసం అభ్యర్థన
ఆకలి చావులపై ప్రత్యక్షంగా చొరవ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రతినిధి బృందం గవర్నర్‌ను అభ్యర్థించింది. విపక్ష నాయకుడు రామచంద్ర కడమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతినిధి బృందం స్థానిక రాజ్ భవన్‌లో గవర్నరు రఘుబర దాస్‌ని మంగళవారం కలిసింది. ఈ బృందంలో శ్రీకాంత జెనా, మహ్మద్ మొకీం, సంతోష్ సింగ్ సలూజా, జయదేవ్ జెనా వంటి పలువురు రాష్ట్ర కాంగ్రెస్ ప్రముఖులు ఉన్నారు. జాతీయ ఆహార భద్రత కింద ఆకలి చావులకు తావు లేకుండా కొనసాగాల్సిన పరిస్థితుల్లో కంధమల్ జిల్లాలో ఇలాంటి విచారకర సంఘటన తలెత్తడం సిగ్గు చేటుగా కాంగ్రెసు ప్రతినిధి బృందం గవర్నరు సమక్షంలో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితిపై ప్రత్యక్షంగా చొరవ తీసుకుని సత్వర చర్యలకు ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించింది. వీరి అభ్యర్థనపై రాష్ట్ర గవర్నరు సానుకూలంగా స్పందించారు. ఈ విషయమై ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శితో సమావేశమై తగిన చర్యలకు ఆదేశించడం జరుగుతుందని అభయం ఇచ్చినట్లు ప్రతినిధి బృందం సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment