రెండు ప్రతిపాదనలకు ఆమోదం
భువనేశ్వర్: రాష్ట్ర మంత్రి మండలి కొత్తగా రెండు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్ర పరిశ్రమలు, ఉన్నత విద్యా శాఖ ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం లభించింది. పారిశ్రామిక విధా నం, విశ్వ విద్యాలయాల చట్టం సవరణ ప్రతిపాదనలు మంత్రి మండలి అంగీకారం పొందడం విశేషం. స్థానిక లోక్ సేవా భవన్‌లో శని వారం ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ ఆహుజా ఈ సమావేశంలో తీర్మానాల్ని సంక్షిప్తంగా మీడియాకు వివరించారు. ఒడిశా పారిశ్రామిక విధానం – 2105లో 2 సవరణలు, ఒడిశా విశ్వ విద్యాలయం చట్టం – 1989 చట్టం సవరణకు మంత్రి మండలి ఆమోద ముద్ర వేసింది. పారిశ్రామిక విధానం పారిశ్రామికవేత్తలకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడిదారుల క్లెయిమ్‌లు సరళీకరించిన విధానంలో సకాలంలో పొందగలుగుతారు. ఉన్నత విద్యా వ్యవస్థని మరింత పటిష్టపరిచేందుకు విశ్వ విద్యాలయం చట్టం సవరణకు మంత్రి మండలి అంగీకరించింది. ప్రధానంగా పరిశోధన రంగంలో మేధావంతులైన విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. అత్యధికులు ఉన్నత విద్యాభ్యాసానికి సునాయాసంగా అవకాశం పొందేందుకు తాజా సవరణ దోహదపడుతుందని వివరించారు. పలు కీలకమైన దైనందిన కార్యకలాపాల్లో విశ్వ విద్యాలయాలకు జవాబుదారీతనంతో సాధికారిత విస్తరించారు. అధ్యాపకుల నియామకం, వైస్ ఛాన్సలర్ల ఎంపికలో విద్యావేత్తల పరిశీలన వంటి అంశాల్లో విశ్వ విద్యాలయాలకు స్వేచ్ఛ కల్పించే దిశలో తాజా సవరణ చేపట్టారు. ఉపాధ్యాయ, అధ్యాపక నియామకం సరళీకరించడంతో ఈ వ్యవహారంలో కోర్టు వివాదాల్ని తొలగించేందుకు అనుకూలంగా చట్టం సవరించినట్లు చీఫ్ సెక్రటరీ వివరించారు. ఉద్యోగాల నియామకంలో పారదర్శకతకు పెద్ద పీట వేసేందుకు మంత్రి మండలి ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. జాతీయ విద్యా విధానం–2020కి అనుకూలంగా ప్రస్తుత చట్ట సవరణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment