ఏకామ్ర క్షేత్రంలో ధూమపానం
భువనేశ్వర్: పవిత్ర ఏకామ్ర క్షేతం లింగరాజు దేవస్థానం ప్రధాన సముదాయంలో ఒక యాత్రికుడు ధూమపానానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు కలకలం రేపుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి చేష్టలు సర్వత్రా అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు దేవస్థానంలోనికి నిషేధిత సామగ్రితో సందర్శకుల ప్రవేశానికి కళ్లెం వేయలేకపోవడం దేవస్థానం భద్రత వ్యవస్థ డొల్లతనం బట్టబయలు చేస్తోందని విమర్శలు బలంగా వ్యాపించాయి. దేబీ105 ఇన్‌స్టా ఐడీతో సోషల్ మీడియాలో ఈ ఫొటోలు జోరుగా ప్రసారం అవుతున్నాయి. ఈ ఖాతా సమాచారం ప్రకారం వ్యక్తి పేరు దేబీ ప్రసాద్ దాస్‌గా స్పష్టం అవుతోంది. ఇతడు లింగరాజు దేవస్థానం పోటు పరిసరాల్లో ధూమపానంతో ఫొటోలు తీసుకున్నట్లు తెలుస్తుంది. మరో వ్యక్తి ఈ ఫొటోలు తీయకుంటే ఇది సాధ్యం కాదని భావిస్తున్నారు. ఈ ప్రసారానికి తక్షణమే కళ్లెం వేయాలని పలు వర్గాలు అభ్యర్థిస్తున్నాయి. స్థానిక పోలీసు ఠాణాలో ఆలయ పాలక వర్గం ఫిర్యాదు నమోదు చేసి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment