విద్యార్థులకు ప్రోత్సహించాలి
రాయగడ: విద్యార్థులను ప్రోత్సహిస్తే చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించగలరని కలెక్టర్ ఫరూల్ పట్వారీ అభిప్రాయపడ్డారు. స్థానిక సిరగుడలోని ఆదర్శ విద్యాలయంలో పర్గిపూల్ పేరిట శిశు మహోత్సవాలు బుధవారం జరిగాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు వారికి సహకారం అందించాలని సూచించారు. అప్పుడే వారు ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరన్నారు. గెలుపు ఓటములను పక్కనబెట్టి ధృడ సంకల్పంతో ముందుకు సాగితే లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందన్నారు.
నైపుణ్యాలు వెలికితీయాలి
విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసే ప్రయత్నం చేయాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరస్వతీ మాఝి అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభకు పదునుపెట్టే ఇటువంటి తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బసంత కుమార్ నాయక్ మాట్లాడుతూ ఈ ఉత్సవాల్లో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల పాల్గొన్నారని వివరించారు. వాలీబాల్, వక్తృత్వ, వ్యాస, పరుగు పందేలు ఇలా 14 రకాల పోటీలను నిర్వహించామన్నారు. వీటిలో గెలిపొందిన వారు రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. జిల్లా సంక్షేమ శాఖ అధికారి భరత్ భూషన్ బిశ్వాల్, ఆదర్శ విద్యాలయం ప్రిన్సిపాల్ సంతోష్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శన ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment