గోల్‌మాల్!
ధాన్యం కొనుగోలులో..
తప్పనిసరి పరిస్థితుల్లో..
ఈ ఏడాది ఖరీఫ్ వరిపంట యంత్రాల ద్వారా కోతలు అవుతున్నా యి. పచ్చిగానే కోసిన ధాన్యం నాలుగైదు రోజుల పాటు ఎండ పెడుతున్నాం. కొంత మంది రైతులు పచ్చిగానే ధాన్యం విక్రయించారు. ఇప్పుడు ఎండిన ధాన్యం అమ్ముకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదు. దీంతో ఊరిలోకి వచ్చిన దళారులకు, ట్రాక్టర్‌పైన తీసుకుని వెళ్లి రైస్ మిల్లులకు అమ్ముకుంటున్నాం.
– పాలక పట్టయ్య, రైతు, జంబాడ, ఎల్.ఎన్.పేట
బీజీ తప్పనిసరి..
బ్యాంక్ గ్యారెంటీ (బిజీ) లేకుండా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకూడదు. సీఎస్‌డీటీని పంపించి మిల్లులను పరిశీలించమని చెబుతాను. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా, బీజీలు చెల్లించకుండా ధాన్యం కొనుగోలు చేయకూడదు. పరిస్థితి తెలుసుకుని జిల్లా అధికారులకు నివేదిస్తాం.
– జె.ఈశ్వరమ్మ, తహశీల్దారు, ఎల్.ఎన్.పేట
●
ఎల్.ఎన్.పేట:
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. ధాన్యం విక్రయాల్లో కొందరు మిల్లర్లు, దళారుల చేతిలో అన్నదాతలు మోసపోతున్నారు. మరోవైపు తుఫాన్ హెచ్చరికలతో ధాన్యం రాశులకు ముప్పు వాటిల్లే అవకాశముండటంతో రైతుల ఆందోళనను కొందరు మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు బ్యాంక్ గ్యారెంటీ (బీజీ)గా కొంత నగదు బ్యాంకులో జమచేయాలి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత ధాన్యం డబ్బులుగా రైతులకు చెల్లింపులు చేస్తారు. ఇలా బీజీ చెల్లించిన మిల్లర్లకే కొనుగోలుకు జిల్లా అధికారులు అనుమతి ఇస్తారు. బీజీ ఉన్నంత వరకు ధాన్యం ఆ మిల్లుకు పంపించేలా సిబ్బంది పనిచేస్తారు. ఈ ఏడాది బీజీలు చెల్లించకుండానే ఇప్పటికే మిల్లర్లు వేలాది బస్తాల ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ కూడా ప్రారంభించారు. అయినా అడిగే వారే లేరు.
కేంద్రాలు తెరిచేదెప్పుడో?
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రైతులకు దక్కాలంటే ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సాంకేతిక, ఇతర సిబ్బంది నియమించాలి. వీరు ధాన్యం తేమ, నాణ్యత పరిశీలించి రైతులు ధాన్యం అమ్ముకునేందుకు సహకరిస్తారు. ఖరీఫ్ వరిచేను కోతలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేలా లేదని భావించిన రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో దళారులు, మిల్లర్లను ఆశ్రయించి వారు అడిగిని ధరకే ధాన్యం విక్రయిస్తున్నారు.
పరిశీలిస్తాం: ఆర్డీఓ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, బ్యాంక్ గ్యారెంటీ (బీజీ) లేకుండా మండలంలోని రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం టెక్కలి ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి దృష్టికి తీసుకెళ్లగా పరిశీలిస్తామని చెప్పారు. మిల్లుల వద్దకు సిబ్బందిని పంపించి విచారణ చేయిస్తామని, తేడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బ్యాంక్ గ్యారెంటీ, అధికారుల అనుమతి లేకుండానే మిల్లర్ల కొనుగోలు
తుఫాన్ హెచ్చరికలను ‘క్యాష్’
చేసుకుంటున్న వైనం
పూర్తిస్థాయిలో తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు
Comments
Please login to add a commentAdd a comment