ఆకలి చావులు కాదు.. ఆహార కాలుష్యం
● మామిడి టెంకల జావ ఘటనపై ప్రభుత్వం వివరణ ● వాయిదా తీర్మానంపై అసెంబ్లీలో చర్చ ● మంత్రి రాజీనామా చేయాలని విపక్షాల డిమాండ్
భువనేశ్వర్:
రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన కంధమల్ జిల్లా మామిడి టెంకల జావ మృతుల ఘటనపై సభలో విపక్షాలు వాయిదా తీర్మానం ప్రతిపాదించాయి. దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించడంతో సభలో వాతావరణం క్రమంగా వేడెక్కింది. ఆకలి మంటలతో ఈ విచారకర సంఘటన అనివార్యమైందని ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ దుయ్యబట్టింది. అయితే ఇవి ఆకలి చావులు కాదని, ఆహా ర కాలుష్య ఘటనగా అధికార పక్షం వివరణ ఇచ్చింది. శాసనసభలో శీతాకాలం సమావేశాలు బుధవారం సభలో రెండో రోజు సభ ఆరంభంలో ప్రశ్నోత్తరాలు శాంతియుతంగా ముగియడంతో, వాయి దా తీర్మానంపై చర్చకు అనుమతి లభించింది.
పాలన వ్యవస్థ అస్తవ్యస్తం
నవీన్ పట్నాయక్ అందజేసిన సుందరమైన పాలన వ్యవస్థని 5 నెలల స్వల్ప నిడివిలో భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తం చేసిందని విపక్ష సభ్యుడు రణేంద్ర ప్రతాప్ స్వంయి ఆరోపించారు. లోటు రాష్ట్రాన్ని నవీన్ సర్కార్ మిగులు రాష్ట్రంగా తీర్చిదిద్దింది. కానీ బీజేపీ పాలన పగ్గాలు చేపట్టిన అతి తక్కువ కాలంలో ఆహార ధాన్యాలు అందక ఆకలి చావులు తాండవించడం ఆరంభమైందని విరుచుకుపడ్డారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న రాష్ట్రాన్ని దారిద్య్ర రేఖ ఎగువకు ఎదుగుదల సాధించిన సమృద్ధి ఒడిశా భారతీయ జనతా పార్టీకి అందినా, పాలన దక్షత కొరవడి అస్తవ్యస్తంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 సంవత్సరంలోనే మామిడి టెంకలు ఆహారానికి యోగ్యం కాదని పేర్కొన్నారని, అయితే అధికారంలోకి రావడంతో మామిడి టెంకలు దళిత వర్గాల సాధారణ ఆహార పదార్థంగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అకాల మరణానికి గురి కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని విపక్ష బిజూ జనతా దళ్ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తక్షణమే 3 నెలల రేషను విడుదల చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఆదేశించారు.
దయలేని ముఖ్యమంత్రి
రాష్ట్రంలో అమాయక ప్రజలు ఆకలి చావులతో ఉసూరుమంటున్న పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సింగపూర్ పర్యటనలో తలమునకలయ్యారని కాంగ్రెసు సభ్యుడు రాజన్ ఎక్కా దుయ్యబట్టారు. బాధిత ప్రజల బాగోగుల పర్యవేక్షణ, మానవతా దృక్పథంతో పరామర్శ కోసం ప్రభావిత ప్రాంతం మండిపొంకా గ్రామం సందర్శించ లేకపోయారని మండిపడ్డారు. తిండి గింజలు కొరవడి ఆదివాసీ ప్రజలు మామిడి టెంకల జావతో పొట్ట నింపుకుని ఆకలి నుంచి గట్టెక్కే ప్రయత్నంలో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి 35 కిలోల చొప్పున రేషన్ బియ్యం క్రమం తప్పకుండా సరఫరా చేసి, ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. మామిడి టెంకలు ఆదివాసీల సాధారణ ఆహారంగా ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా వ్యాఖ్యానించడంపై కాంగ్రెసు సభ్యుడు ప్రఫుల్ల చంద్ర ప్రధాన్ ఘాటుగా వ్యతిరేకించారు. పార్టీ మనుగడ కోసం ఉప ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం తగదన్నారు. మామిడి టెంకలు ఆదివాసీల సాధారణ ఆహారం కాదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆకలి తీర్చుకోవడం ఆరగించి అకాల మరణానికి గురైన విచారకర పరిస్థితిని ఉప ముఖ్యమంత్రి పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఆహార కాలుష్యమే: మంత్రి కృష్ణచంద్ర
కంధమల్ జిల్లాలో సంభవించిన మృత్యు సంఘటన ఆకలి చావు కాదని రాష్ట్ర ఆహార, పౌర సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో అన్నారు. ఇది ఆహార కాలుష్యంతో జరిగిన విచారకర ఘటనగా పేర్కొన్నారు. ఈ మేరకు వైద్య వర్గాలు జారీ చేసిన పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు. ఈ ఘటన చోటుచేసుకునే సమయానికి ఆహార భద్రత కింద సరుకుల పంపిణీ పుష్కలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు మృతుల కుటుంబీకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేసిందన్నారు. ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్యలను చేపడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment