చైతీ ఉత్సవాలకు సన్నాహాలు
రాయగడ: స్థానిక గోవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానం వేదికగా డిసెంబర్ 26వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరగనున్న చైతీ మహోత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అందరి సహకారంతో ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతో కమిటీలు, సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు. పట్టణ ప్రముఖులు, పాత్రికేయులు, విద్యావేత్తలు, అధికారులతో వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించేవిధంగా మొత్తం 14 కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతీ కమిటీకి ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించేలా యంత్రాంగం ఆయా కమిటీలకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారి ప్రతిపాదనలను కూడా పరిగణలోకి తీసుకుంటుండడం విశేషం. సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్రా దేవి, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వాహక అధికారి నిహారి రంజన్ కుహరో, ఏడీఎం భాస్కర రైతా, సంస్కృతిక విభాగాధికారి సుచిత్ర బౌరి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్‌లు కమిటీలను పర్యవేక్షిస్తున్నారు.
ఆకర్షణీయంగా వేదిక
ఇదిలా ఉండగా ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఈసారి వేదిక ఆకర్షణీయంగా రూపొందించేందుకు జిల్లా యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఆదివాసీల సాంప్రదాయం, వారి కళలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళాకారులతో వేదికను రూపొందించాలని నిర్ణయించారు. ప్రముఖుల సూచనలను పరిగణలోకి తీసుకున్న యంత్రాంగం ఈమేరకు చర్యలు తీసుకుంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment