ఆడబిడ్డ అమ్మకం
గురువారం శ్రీ 28 శ్రీ నవంబర్ శ్రీ 2024
● సవతి తల్లి పోరుతో నాలుగేళ్ల చిన్నారి విక్రయం ● రూ.40 వేలకు అమ్మేసిన కన్నతండ్రి ● అదుపులోకి తీసుకున్న పోలీసులు
భువనేశ్వర్: రాజధాని నగరంలో ఆడబిడ్డ అమ్మకం కలకలం సృష్టించింది. సవతి తల్లి ప్రేరేపణతో కన్న కూతురినే తండ్రి అమ్మేసిన ఉదంతం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన సుబోధ్ శర్మకు మొదటి భార్యతో ఆడబిడ్డ సంతానం కలిగింది. ఆ బాలిక వయసు ప్రస్తుతం 4 ఏళ్లు. అయితే కొద్దికాలం తర్వాత గుడియా దే అనే మహిళను అతను రెండో వివాహం చేసుకున్నాడు. తొలి భార్య సంతానం ఆడబిడ్డ, రెండో భార్యతో కలిసి సుబోద్ శర్మ బీహార్ నుంచి నగరానికి చేరుకొని టొంకొపాణి ప్రాంతంలో అద్దె ఇంట్లో నివాసముండేవాడు. ఆయన వడ్రంగి వృత్తి నుంచి సమకూరిన ఆదాయంతో కాపురం నెట్టుకొస్తున్నారు.
సవతి తల్లి అసూయ
కాలానుక్రమంగా చిన్నారి ముద్దూముచ్చటపై సవతి తల్లికి సహించలేని అసూయ భావం పెరిగింది. ఈ విషయం గమనించిన కన్న తండ్రి సవతి తల్లి నుంచి బిడ్డని దూరంగా ఉంచడం మంచిదని భావించి అనాథ ఆశ్రమంలో చేర్చేందుకు విఫలయత్నం చేశాడు. అయితే ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న రెండో భార్య చిన్నారి అమ్మకానికి అతడిని ప్రేరేపించింది. బిడ్డని విక్రయించేందుకు ఇద్దరు దళారులను గుర్తించింది. వీరి సహకారంతో చిన్నారిని కొనుగోలు చేసేందుకు దంపతులను సిద్ధం చేసుకున్నారు. ఈ దంపతులు పూరీ జిల్లా పిపిలి గ్రామస్తులు.
రూ.40 వేలకు డీల్
దళారులతోకలిసి చిన్నారి విక్రయానికి సిద్ధమైన అనంతరం రూ.40 వేలు ధరను నిర్ధారించారు. ఇందులో రూ.35 వేలు కన్నతండ్రి సుబోద్ శర్మకు, మిగిలిన రూ.5 వేలు సవతి తల్లికి ముట్టజెప్పారు. పిప్పిలి గ్రామానికి చెందిన రఘునాథ్ బెహరా దంపతులు దళారుల ఆధ్వర్యంలో 4 ఏళ్ల ఆడబిడ్డని రూ.40 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. రూ.35 వేలు బిడ్డ కన్న తండ్రికి నగదు రూపంలో, మిగిలిన రూ.5 వేలు సవతి తల్లికి ఫోను పే ద్వారా చెల్లించి బిడ్డని తీసుకుని వెళ్లారు. ఇదంతా ఏమాత్రం బయటకు పొక్కకుండా గుట్టుగా నడిపించారు.
ఇంటి ఓనర్ నిలదీయడంతో...
కథ సుఖాంతం అయిందనుకునే తరుణంలో మెల్లగా అడ్డం తిరిగింది. సుబోద్ శర్మ కుటుంబం అద్దెకి ఉంటున్న ఇంటి యజమాని వీరి బిడ్డ కనబడకపోవడంతో సందేహంతో నిలదీశాడు. దీంతో గుట్టు రహస్యంగా ఉంచలేక నిజం వెల్లడించారు. ఇంటి యజమాని ఈ విషయాన్ని స్థానిక బరగడ్ ఠాణా పోలీసులకు పూస గుచ్చినట్లు వివరించాడు. ఈ కథనం ఆధారంగా పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి బిడ్డని విక్రయించిన ఆరోపణ కింద సుబోద్ శర్మ దంపతులను తొలుత అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రశ్నించగా సవతి తల్లి వేధింపులే కారణమని బిడ్డ తండ్రి పోలీసులకు వివరించాడు. దీనిపై ఆరాతీయగా సవతి తల్లి అంగీకరించి బిడ్డ విక్రయానికి ఏర్పాటు చేసిన దళారుల వివరాలను పోలీసులకు తెలియజేసింది. ఈ సమాచారం ఆధారంగా ఇద్దరు మహిళా దళారులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దళారుల సమాచారం ఆధారంగా బిడ్డని కొనుగోలు చేసిన దంపతులను సైతం అదుపులోకి తీసుకుని, అమ్ముడుపోయిన బిడ్డని హస్తగతం చేసుకున్నారు. విచారణ కొనసాగుతోందని బరగడ్ ఠాణా పోలీసు అధికారి ఐఐసీ తృప్తి రంజన్ నాయక్ తెలిపారు. బిడ్డని శిశు సంక్షేమ కమిటీ (సీడబ్ల్యూసీ)కి అప్పగించనున్నట్లు ప్రకటించారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment