ఆ మిల్లర్లను ఉపేక్షించవద్దు
కరగాంలోని కొనుగోలు కేంద్రం వద్ద రికార్డులను పరిశీలిస్తున్న జేసీ
నరసన్నపేట: ధాన్యం కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగడంపై జాయింట్ కలెక్టర్ షర్మాన్ అహ్మద్‌ఖాన్ అసహనం వ్యక్తం చేశారు. కొనుగో లు కేంద్రం ఏజెన్సీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పనిచేయని తేమ శాతం పరికరాలను గమనించి అధికారులను ప్రశ్నించారు. నరసన్నపేట మండలం కరగాం, చిక్కాలవలస కోనుగోలు కేంద్రాలను జేసీ బుధవారం పరిశీలించారు. ధాన్యం తేమ శాతం పరిశీలించి షెడ్యూల్ ఇచ్చి ట్రక్‌షీట్ జనరేట్ చేసి రైతు నచ్చిన మిల్లుకు ధాన్యం పంపేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాలపై నిరంతర నిఘా ఉండాలని తహసీల్దార్, డీటీ, వ్యవసాయాధికారులకు సూచించారు. కరగాం కొనుగోలు కేంద్రంలో ఏజెన్సీ కంప్యూటర్ ఆపరేటర్, టెక్నికల్ అసిస్టెంట్ సరైన సమాధానాలు చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరి కారణంగానే ధాన్యం కొనుగోలు ఆలస్యం జరుగుతున్నట్లు ఉందని, వెంటనే సరిచేయాలని సిబ్బందిని ఆదేశించారు.
వారిని బ్లాక్ లిస్టులో పెట్టండి..
నరసన్నపేటలో కొందరు మిల్లర్లు తేమ శాతం పేరుతో అదనంగా రెండు నుంచి నాలుగు కేజీల ధాన్యం అడుగుతున్నారని రైతులు జేసీ దృష్టికి తీసుకువెళ్లారు. ఇటువంటి మిల్లర్లను ఉపేక్షించవద్దని, తనిఖీలు చేసి వాస్తవమైతే అటువంటి వారిని బ్లాక్ లిస్టులో పెట్టాలని జేసీ సివిల్ సప్లయ్ డీటీని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లోని యంత్రానికి, మిల్లర్ల వద్ద ఉన్న యంత్రానికి తేమలో ఒక శాతం తేడా చూపిస్తోందని జిల్లా వ్యవసాయాధికారి త్రినాథస్వామి జేసీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ మిల్లర్ల మిషన్‌తో తమకు సంబంధం లేదని, మనం నిర్ణయించిందే ఫైనల్ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ఏడీ రవీంద్రభారతి, వ్వవసాయాధికారి కె.సునీత, తహసీల్దార్ సత్యనారాయణ, సీవిల్ సప్లయ్ డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలులో అలసత్వం తగదు
ఏజెన్సీ సిబ్బందిపై జేసీ ఆగ్రహం
పనిచేయని తేమ శాతం యంత్రాలు చూసి అసహనం
Comments
Please login to add a commentAdd a comment