పూరీ జిల్లాలో అతిసార మరణాలు
● దయా నది నీరు కలుషితం
భువనేశ్వర్ : పూరీ జిల్లాలో అతసార వ్యాపించింది. ఇటీవల కాలంలో దీని ప్రభావంతో నలుగురు మృతి చెందారు. ఈ పరిస్థితి తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ యంత్రాంగం ఉలిక్కిపడింది. ప్రభావిత ప్రాంతాలకు పూరీ జిల్లా ఆరోగ్య శాఖ అధికార బృందం తరలివెళ్లింది. నీటి కాలుష్యంతో ఈ దుస్థితి తాండవిస్తుందని ప్రాథమికంగా గుర్తించారు. అతిసార ప్రభావిత ప్రజలు స్థానిక దయా నది నీరుపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నది నీరు పూర్తిగా కలుషితమై ప్రాణాంతకంగా పరిణమించినట్లు ప్రయోగ శాల పరీక్షల్లో తేలింది. దయా నది నీరు మానవ వినియోగానికి ఎంత మాత్రం పనికిరాదని స్పష్టం చేశారు. ఎటువంటి నిత్య అవసరాలకు ఈ నీటిని వినియోగించవద్దని పూరీ ప్రధాన జిల్లా వైద్యాధికారి (సీడీఎంఓ) రూపభాను మిశ్రా ప్రాంతీయులకు సూచించారు. పూరీ జిల్లా కొణాస్ మండలం గోపీనాథ్‌పూర్, గదీష్‌గొపొ గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో అతిసారం విస్తరించింది. గత 15 రోజుల నుంచి పలువురు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరుతున్నారు. అతిసార బారిన పడి 4 మంది వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో సీడీఎంఓ స్పందించారు. సీడీఎంఓతో సహా ఆరోగ్య శాఖ అధికారుల బృందం ప్రభావిత గ్రామాలను సందర్శించింది. అతిసార ఆవిర్భావం, వ్యాప్తి కారణాల్ని ఈ బృందం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించింది. గ్రామస్తులు దైనందిన అవసరాలకు దయా నది నీటిపై ఆధారపడుతున్నారు. ప్రయోగశాల పరీక్ష కోసం దయా నది నీటి నమూనాను సిఫారసు చేశారు. ప్రయోగశాల పరీక్షలో దయా నది నీరు అత్యంత కలుషితమైందని, వినియోగానికి సరిపోదని తేలింది. ఈ నదీ జలాలను ఎలాంటి అవసరాలకు వినియోగించవద్దని ప్రజలకు సూచించాం’ అని రూపభాను మిశ్రా తెలిపారు. అతిసార ప్రభావిత గ్రామాల్లో పూరీ అదనపు కలెక్టర్ శరత్ చంద్ర బెహెరా, సబ్ కలెక్టర్ రాజ్ కిషోర్ జెనాతో కూడిన బృందం సంయుక్తంగా పర్యవేక్షిస్తుందని సీడీఎంఓ తెలిపారు. ఈ బృందం గ్రామంలో ఇంటింటా డయేరియా వ్యాప్తికి సంబంధించిన వివరాల కోసం సంప్రదించారు. ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛమైన, పరిశభ్రమైన తాగు నీటిని సరఫరా చేసేందుకు ఆ శాఖ ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా, గ్రామస్తులు గొట్టపు బావుల నీటిని మాత్రమే ఉపయోగించాలని గ్రామస్తులకు తెలిపారు.
ప్రభుత్వం చర్యలు చేపడుతుంది
పూరీ జిల్లా కొణాస్ మండలంలో అతిసార పరిస్థితిపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి రవి నాయక్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం అతిసార నివారణ, నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. స్థానిక పంచాయతీ ఆధ్వర్యంలో ట్యాంకర్ల ద్వారా గ్రామస్తులకు సురక్షిత తాగు నీటి సరఫరా జరుగుతోంది. దయా నది నీటి కాలుష్యంపై త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పూరీ జిల్లాలో ప్రాణాల్ని బలిగొంటున్న అతిసార పరిస్థితిపై బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నవీన్ పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోగం వ్యాప్తి నివారణ ఇతరేతర ఆరోగ్య జాగ్రత్తల పట్ల ప్రజల అవగాహన కోసం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇంటింటికీ వెళ్లి చైతన్యపరచాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment