ఓటర్ల దినోత్సవం
ఘనంగా..
పర్లాకిమిడి: ఒక్క ఓటుతో మన ఎంపీ, ఎమ్మెల్యేల జాతకాలు తారుమారు అవుతాయని 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ బిజయ కుమార్ దాస్ అన్నారు. పట్టణంలో జాతీయ ఓటరు దినోత్సవం పురస్కరించుకుని మహారాజా ప్యాలస్ నుంచి కాలేజ్ జంక్షన్ వరకు వాకథాన్‌ను అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్ ప్రారంభించారు. అనంతరం రాజవీధిలో ఆర్బన్ బ్యాంకు గ్రౌండ్స్‌లో జరిగిన సాధారణ సమావేశంలో కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా ఎస్పీ జితేంద్ర కుమార్ పండా, డీఎఫ్‌ఓ ఎస్.ఆనంద్, డీఆర్‌డీఏ ముఖ్యకార్యనిర్వాహణ అధికారి గుణనిధి నాయక్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శతాధిక వృద్ధ ఓటర్లు నలుగుర్ని కలెక్టర్ దాస్ సత్కరించారు. అనంతరం ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోనని ప్రజలందరితో కలెక్టర్, ఎస్పీలు శపథం చేయించారు. అనంతరం నూతనంగా ఓటు హక్కు పోందిన యువతీ యువకులకు ఓటరు కార్డులను అందజేశారు. ఓటరు చైతన్యం, హక్కుపై నిర్వహించిన వివిధ పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలను అధికారులు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ సుచెస్మితా మఝి, బి.డి.ఓ.(గుసాని) గౌరచంద్ర పట్నాయిక్ తదితరులు పాల్గొన్నారు.
రాయగడలో..
రాయగడ: జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురష్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ నిహారి రంజన్ కుహోరొ పచ్చ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. సమితి కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పురవీధుల మీదుగా బిజు ఆడిటోరియం వరకు కొనసాగింది. ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ ఫరూల్ పట్వారి, సబ్ కలెక్టర్ కల్యాణి సంఘమిత్రా దేవి పాల్గొన్నారు. ఈ సందర్భ ంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను కలెక్టర్ పట్వారి అందించారు.
జయపురంలో..
జయపురం: ఓటు ప్రజలకు రాజ్యాంగం కల్పిన ప్రాథమిక హక్కు అని జయపురం సబ్ కలెక్టర్, మునిసిపాలిటీ కార్యనిర్వాహక అధకారిణి అక్కవరం శొశ్యా రెడ్డి అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం స్థానిక టౌన్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ ఓటు ఒక ఆయుధమని తమకు నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా చట్టసభలకు ఎన్నుకునే సాధనమని తెలిపారు. ప్రలోభాలకు, డబ్బుకు లొంగకుండా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment