ఘోష యాత్ర సన్నాహాలు
భువనేశ్వర్: పవిత్ర శ్రీపంచమి సందర్భంగా పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్రకు తయారు చేసే రథాల కలప పూజలు నిర్వహించడం ఆచారం. 3 కొత్త రథాల తయారీ కోసం నిర్మాణ శాల ప్రాంగణానికి చేరిన తొలి విడత నుంచి ఒక్కో రథం కోసం లాంఛనంగా ఒక్కో దుంగని ఎంపిక చేసి ప్రత్యేకంగా పూజాదులు నిర్వహించడంతో అక్షయ తృతీయ నుంచి రథ తయారీ పనులకు అంకురార్పణ పూర్తవుతుంది. శ్రీ జగన్నాథ ఆలయ కార్యాలయంలో సరస్వతీ దేవిని పూజించిన తరువాత రథ కలప సంస్కరణ పూజాదులు నిర్వహించారు. ఒక్కో రథానికి ఒక్కో కలప దుంగ చొప్పున ఎంపిక చేసిన 3 కలప దుంగల్ని గజపతి మహా రాజా రాజగురువు ఆధ్వర్యంలో ఆలయ ఆచారాల ప్రకారం ప్రత్యేక సంస్కరణ పూజాదులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ ప్రాంగణంలో చున్నపు నీరు చల్లి శుద్ధి చేశారు. వసంత పంచమి తిథి నాడు ప్రత్యేకంగా పూజించిన కలప దుంగల్ని బలభద్ర స్వామి తాళఽ ధ్వజం, సుభద్ర దేవి దర్ప దళనం, శ్రీ జగన్నాథుని నందిఘోష్ రథాల ప్రధాన ఆధార భాగం తయారీలో వినియోగిస్తారు. శ్రీ మందిరం పాలక వర్గం, రథ కలప పర్యవేక్షకులు, భోయి సేవకులు, శ్రీమందిర పాలకమండలి అధికారుల సమక్షంలో సుమారు గంటపాటు పూజార్చనలు జరిపించారు. ఈ ఏడాది రథాల నిర్మాణానికి 865 కలప దుంగలు అవసరం కాగా మొదటి దశలో మొత్తం 101 దుంగల్ని నయాగడ్ అటవీ శాఖ పంపిణీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment