వివాహిత అనుమానాస్పద మృతి
● అత్తింటివారే హత్య చేశారని తండ్రి ఫిర్యాదు
రాయగడ: వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. జిల్లాలోని గుణుపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి గణేష్ బిహార్ కాలనీలో సొమవారం చోటుచేసుకోగా రస్మీరంజని బొడోకుమార్ (24) ప్రాణాలు కోల్పోయారు. సమాచారం తెలుసుకున్న గుణుపూర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృదేహాన్ని స్వాధీనం చేసుకుని గుణుపూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే తన కుమార్తెను అత్తింటివారే గొంతునులిమి హత్య చేశారని ఆరోపిస్తూ మృతురాలి తండ్రి కుంజ బిహారి బొడోకుమార్ గుణుపూర్ ఆదర్శ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజపతి జిల్లా పర్లాకిమిడిలోని విద్యానగర్‌లో నివసిస్తున్న కుంజో బిహారి కూతురు రస్మీ రంజనికి రాయగడ జిల్లా పరిధిలోని చంద్రపూర్ గ్రామానికి చెందిన సతర చంద్ర మాఝి కొడుకు దేవాశీష్‌తో 2024 జూలై మూడో తేదీన అత్యంత వైభవంగా వివాహం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న దేవాశీష్ తన భార్యను అన్యోన్యంగా చూసుకుంటుండేవాడు. అయితే కొద్ది నెలలుగా తనకు ఇచ్చిన కట్నం సరిపోదని.. ఇంకా తీసుకురావాలని భర్తతోపాటు అతని తల్లిదండ్రులు వేధిస్తున్నారని మృతురాలి తండ్రి ఫిర్యాదులొ పేర్కొన్నారు. అయితే సోమవారం రస్మీరంజని మృతి చెందినట్లు సమాచారం రావడంతో కన్నవారు గుణుపూర్ చేరుకున్నారు. తన కూతురుని అదనపు కట్నం కోసం వేధించి గొంతునులిమి హత్య చేసినట్లు మృతురాలి తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు మలుపు తిరిగింది. కాగా కేసు దర్యాప్తు కోసం జిల్లా అదనపు ఎస్‌పి విష్ణు ప్రసాద్‌పాత్రో సొమవారంగుణుపూర్ చేరుకున్నారు. పోస్టు మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.
వివాహిత అనుమానాస్పద మృతి
Comments
Please login to add a commentAdd a comment