నలుగురు గంజాయి విక్రేతల అరెస్టు
అద్దంకి రూరల్: జల్సాలకు అలవాటుపడి డబ్బులు సంపాదించాలని గంజాయి అమ్ముతున్న యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈఘటనపై సీఐ కృష్ణయ్య శుక్రవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. సీఐ వివరాల మేరకు.. తాళ్లూరుకు చెందిన చేజర్ల ఫణిధర్ అద్దంకిలోని బస్టాండ్ వెనుకవైపు హన్విక పెట్ స్పా క్లినిక్ నడుపుతున్నాడు. దేవరకొండ బాల హరీష్‌కృష్ణ అలియాస్ హరీష్ స్పా సెంటర్ పక్కనే టాటూ షాపు నిర్వహిస్తున్నాడు. వీరికి వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో అక్రమ మార్గం ఎంచుకున్నారు. ఈక్రమంలో వీరిద్దరికి తెలిసిన మూడో వ్యక్తి మార్టూరుకు చెందిన బిళ్ల ప్రకాష్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు అద్దంకి వచ్చి గంజాయి అమ్ముతుంటాడు. ఫణిధర్, హరీష్‌లు ప్రకాష్ వద్ద తీసుకుని అమ్మటం, తాగటం చేస్తుంటారు. ప్రకాష్ తన అత్తగారి ఊరు అనకాపల్లి జిల్లా, నర్సీపట్నానికి చెందిన వ్యక్తి ద్వారా గంజాయి తెస్తుంటాడు. ఫణిధర్, హరీష్‌లు ఇద్దరూ ప్రకాష్ వద్ద గంజాయి తీసుకుని చిన్నచిన్న ప్యాకెట్లు కట్టి అధిక మొత్తంలో టాటు షాపు పక్కన ఒక ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచి అమ్ముతున్నారు. వీరినుంచి సుమారు 13 మంది యువకులు కొనుగోలు చేస్తున్నారు.
విద్యార్థులే టార్గెట్..
అంతేకాకుండా ఈక్రమంలో అద్దంకిలోని పోతురాజు గండి వద్ద మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్న పరుచూరి చందు గంజాయికి అలవాటు పడ్డాడు. బొగ్గులకొండ వద్ద స్వామిజీతో పరిచయం ఏర్పడి అక్కడి నుంచి గంజాయి తాగుతుంటాడు. మిగిలిన వాటిని ఫణిధర్‌కు, హరీష్‌కు విక్రయిస్తుంటాడు. విద్యార్థులను టార్గెట్ చేసుకుని వారితో స్నేహం చేసి గంజాయిని విక్రయిసుంటారు. వీరినే కాకుండా ఈ కేసులో గంజాయి కొనుగోలు చేస్తున్న వారిపై, అమ్ముతున్న వారిపై నిఘా ఉంచినట్లు సీఐ తెలిపారు. త్వరలోనే అందరినీ పట్టుకుంటామన్నారు. గురువారం సీఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో అద్దంకిలో తన సిబ్బందితో దాడులు జరిపి ఫణిధర్, హరీష్, బిళ్ల ప్రకాష్, చందు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7200 విలువగల 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఈ కేసులో సహకరించిన అద్దంకి ఎస్సైలు ఖాదర్‌బాషా, ప్రవీణ, ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ ఐ.శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు జి.అంకమ్మరావు, పి.సాయి కృష్ణారెడ్డి, ఎం.గోపి, ఎస్.నాగరాజులను సీఐ అభినందించారు.
1200 గ్రాముల గంజాయి స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment