భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నాగులచవితి సందర్భంగా నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పాలుపోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం వేకువజామున భక్తులు పవిత్ర కృష్ణానదిలో కార్తిక స్నానాలు చేసి ఆలయంలోని ఉసిరిక చెట్టు వద్ద కార్తిక దీపాలను వెలిగించారు. అనంతరం అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి, ఆలయంలోని మొదటి ప్రాకారంలో జ్వాలాముఖి అమ్మవారి ఆలయం వద్ద, తూర్పు గాలిగోపురం వద్ద ఉన్న నాగేంద్రుని పుట్టలలో పాలు పోసి పూజలు నిర్వహించారు. నాగేంద్రునికి ఇష్టమైన నువ్వులపిండి, సజ్జనాను బాలు, ఆవుపాలు, అరటిపండ్లు, చలిమిడి, పదార్థాలను పుట్టలో వేసి దీపారాధనలు చేసి పూజలుచేశారు. పుట్టమట్టిని పిల్లల చెవులకు పెట్టి నాగేంద్రుని స్తోత్రాలను పఠించారు. ఆలయస్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ నాగులచవితి విశిష్టతను వివరించారు. మధ్యాహ్నం వరకు పలు గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు.
సుబ్రమణేశ్వరునికి విశేష పూజలు
అమరేశ్వరాలయంలో నాగులచవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాలయంలోని సుబ్రమణేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం స్వామివారికి భక్తుల సమక్షంలో అర్చకులు శంకరమంచి రాజశేఖరశర్మ, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము ఆలయంలోని సుబ్రమణ్వేశ్వరునికి విశేషాలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ పూజలలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment