పట్టభద్రుడా.. పట్టదా!
సత్తెనపల్లి: రానున్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటు నమోదుకు ఒక్క రోజే గడువు ఉంది. అయినా చాలామంది ఓటు నమోదు చేసుకునేందుకు ముందుకు రావడం లేదు. అర్హత కలిగిన వారు ఓటు నమోదుకు ముందుకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. బీఎల్వోలతో అధికారులు సమావేశాలు నిర్వహించి ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశాలిస్తున్నారు. రాజకీయపార్టీల ముఖ్య నేతలు అవగాహన కల్పిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పట్టభద్రులకు ఓటు నమోదుకు సంబంధించిన దరఖాస్తులు అందిస్తున్నారు.
అర్హత ఉండి దూరంగా...
చాలామంది డిగ్రీలు పూర్తిచేసిన పట్టభద్రులు ఓటు నమోదుకు అవగాహన లేక ఆసక్తి కొరవడి నమోదు చేయించుకోవడం లేదు. ప్రస్తుతం నమోదుకు పలు ఇబ్బందులు ఉన్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. దరఖాస్తుపై గెజిటెడ్ అధికారి సంతకం చేయించాల్సి ఉంది. అధికారి దగ్గరకు వెళితే వారు సరిగ్గా స్పందించకపోవడంతో కొంత మంది వెను తిరుగుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత పత్రాలు అప్‌లోడ్ చేసినా పరిశీలన పేరుతో ఆయా కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని పలువురు పట్టభద్రులు అంటున్నారు. ఈ తతంగం అంతా చేయలేక కొందరు పట్టభద్రులు ముందుకు రావడం లేదు.
సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 11,898 దరఖాస్తులు
సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఒక పట్టణం, 9 మండలాలు ఉన్నాయి. సెప్టెంబర్ 30 నుంచి మంగళవారం వరకు సత్తెనపల్లి నియోజకవర్గంలో 6,517 దరఖాస్తులు, పెదకూరపాడు నియోజకవర్గంలో 5,381 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
మందకొడిగా ఓటు నమోదు దరఖాస్తులు సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్‌లో 11,898 దరఖాస్తులు
నేటితో ఓటు నమోదుకు ఆఖరు..
అర్హత కలిగిన పట్టభద్రులందరూ బుధవారం సాయంత్రం లోపు ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పలుచోట్ల అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బీఎల్వోలు గతంలో ఓటు ఉన్నవారికి సెల్‌ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. కావలసిన పత్రాలు ఇస్తే దరఖాస్తు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు డివిజన్ పరిధిలోని పట్టభద్రులంతా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment