కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోండి
కలెక్టర్ అరుణ్‌కుమార్ వెల్లడి
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నూతన రేషన్ కార్డుల కోసం డిసెంబరు రెండో తేదీ నుంచి 28 లోపల దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కార్డులకు సంబందించి ఆధార్ సీడింగ్, స్పిట్లింగ్ ఆఫ్ రేషన్‌కార్డు, కార్డులో కుటుంబ సభ్యుల చేర్చడం వంటి పనులు చేస్తారని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 6,45,110 కార్డులు ఉండగా వీటన్నింటినీ మార్చి కొత్త కార్డులు సంక్రాంతి నాటికి అందజేస్తారని వెల్లడించారు.
ఎన్‌ఎంఎంఎస్ మోడల్ పేపర్ ఆవిష్కరణ
నరసరావుపేట ఈస్ట్: జాతీయస్థాయిలో 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ఎన్‌ఎంఎంఎస్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ తెలిపారు. పల్నాడు బాలోత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్‌ఎంఎంఎస్ మోడల్ గ్రాండ్ టెస్ట్ పేపర్‌ను గురువారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డిసెంబర్ 8న జరగనున్న పరీక్షలో అధిక శాతం విద్యార్థులు ఉత్తీర్ణులై స్కాలర్‌షిప్‌లు పొందాలని ఆకాంక్షించారు. మోడల్ పేపర్ తయారుచేసిన ఉపాధ్యాయులు ఎం.శివశంకర్, ఎస్.రమేష్‌లను అభినందించారు. జిల్లా బాలికల విద్యాభివృద్ధి అధికారిణి దొండేటి రేవతి, బాలోత్సవ్ కమిటీ ప్రధాన కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాలువలో ఇద్దరు
చిన్నారులు గల్లంతు
వినుకొండ: సాగర్ ప్రధాన కాలువలో పడి ఇద్దరు చిన్నారులు గల్లంతైన ఘటన గురువారం ఈపూరు మండలం ముప్పాళ్ల వద్ద జరిగింది. వనికుంట గ్రామానికి చెందిన విలేకరి వెంకట నాగాంజనేయ శర్మ, తన ఇద్దరు కూతుర్లు యామిని(11), కావ్య(7) ఉదయం 8.30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంతో సహా ఎన్‌ఎస్పీ కాలువలో పడ్డారు. కాలువలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో చిన్నారులు యామిని, కావ్య నీటమునిగినట్టు తెలుస్తోంది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న శర్మ స్థానికుల సహాయంతో బయటపడ్డాడు. విషయం తెలిసిన ఈపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. చిన్నారులు మునిగిన చోట లోతు అధికంగా ఉండటంతో స్థానిక ఈతగాళ్లు పిల్లల ఆచూకీ తెలుసుకోలేకపోయారు. దీంతో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టు స్థానిక ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు.
23న జెడ్పీ సర్వసభ్య సమావేశం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 23న నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశం ఉంటుంది. ఈ మేరకు జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షత వహించనున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. వ్యవసాయ అనుబంధ శాఖలతోపాటు గృహ నిర్మాణం, విద్య, వైద్యారోగ్య, జలవనరులు, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్యం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, ఉపాధి హామీపై అజెండాలో పొందుపర్చిన అంశాలపై సమీక్ష ఉంటుందని సీఈవో పేర్కొన్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలు
జరిపితే సహించేది లేదు
జిల్లా మైనింగ్ అధికారి రాజేష్
బాపట్లటౌన్: జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు జరిపితే సహించేది లేదని జిల్లా మైనింగ్ అధికారి రాజేష్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం మండలంలోని వెదుళ్లపల్లి సమీపంలో ఉన్న ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణా చేసినా, నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినా సహించేది లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment